Oct 18,2023 09:43

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:నవంబరు 15న ప్రజారక్షణ భేరి బహిరంగ సభ విజయవాడలో జరగనుందని, ఈ సభకు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరవుతారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నవంబరు 7న జరగాల్సిన బహిరంగ సభ అనివార్య కారణాల వల్ల నవంబరు 15కు వాయిదా పడిందని పేర్కొన్నారు. అక్టోబరు 3వ వారంలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుండి బయలుదేరాల్సిన మూడు జాతాలు షెడ్యూలు మారిందని, అక్టోబరు 30న గిరిజన ప్రాంతాలను కలుపుతూ బయలుదేరే జాతా సీతంపేటలో ప్రారంభమవుతుందని తెలిపారు. అదే రోజున కర్నూలు జిల్లా ఆదోనిలో మరోజాతా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు తదితర వెనుకబడిన ప్రాంతాలను కలుపుతూ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. నవంబరు 2న ఉత్తరాంధ్ర పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ 3వ జాతా శ్రీకాకుళం జిల్లా మందసలో ప్రారంభమవుతుందని వివరించారు. ఈ మూడు జాతాల ముగింపు సందర్భంగా నవంబరు 15న విజయవాడలో బసవపున్నయ్య స్టేడియంలో భారీ బహిరంగ సభ జరగనుందని వివరించారు. అసమానతలు లేని అభివృద్ధి కోసం జరిగే ప్రజారక్షణ భేరి జాతాలు, బహిరంగ సభకు ప్రజలు పెద్దయెత్తున తరలి రావాలని రాష్ట్ర ప్రజానీకాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున కోరారు.