Jul 24,2023 10:42

రక్షించలేని ప్రభుత్వాలకు పాలించే అర్హత లేదు
మణిపూర్‌ ఘటనను నిరసిస్తూ
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, రౌండ్‌టేబుల్‌ సమావేశాలు
ప్రజాశక్తి - యంత్రాంగం : 
మణిపూర్‌లో ఆదివాసి మహిళలను వివస్త్రను చేసి ఊరేగించిన నిందితులను కఠినంగా శిక్షించాలని, మహిళలపై దాడులను నిరసిస్తూ ఆదివారం ఐద్వా, ఎపి ఆదివాసి గిరిజన, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, మానవహరాలు, రౌండ్‌టేబుల్‌ సమావేశాలు, కొవ్వొత్తులతో ప్రదర్శనలు నిర్వహించారు. మణిపూర్‌ అల్లర్లను అరికట్టడంలోనూ, ఆదివాసీ మహిళలకు భద్రత కల్పించడంలోనూ విఫలమైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని పలువురు నాయకులు డిమాండ్‌ చేశారు. కర్నూలులో జనకవనం నిర్వహించారు.

అరకులోయలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యాన రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో గిరిజన మహిళా సంఘం, నేర నిరోధక సంఘం, యుటిఎఫ్‌, ఎపిటిఎఫ్‌ పిర్‌టియు, దండకారణ్య సంఘం, ఎపిఎస్‌, ఆదివాసీ కాఫీ రైతు సంఘం, ట్రైబల్‌ జర్నలిస్టుల సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ, ఆదివాసీ మాతృభాషా సంఘం నాయకులు పాల్గన్నారు. ఎపి ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ.. ఆదివాసీ మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మణిపూర్‌ ఇంత ఘోరం జరుగుతున్నా ప్రధాని మోడీ పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. మణిపూర్‌ అల్లర్లను అరికట్టడంలోనూ, ఆదివాసీ మహిళలకు భద్రత కల్పించడంలోనూ విఫలమైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మణిపూర్‌లోని అమానవీయ ఘటనలు మానవత్వానికి మాయని మచ్చ అని అన్నారు. అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో సాహితీవేత్తల సమావేశం జరిగింది. మణిపూర్‌ హింసాకాండను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని ఈ సమావేశం ఖండిస్తూ తీర్మానం చేసింది. సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌.శర్మ మాట్లాడుతూ.. ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో రచయితలు, కవులు ముందుండాలని కోరారు. విశాఖ జిల్లా ఆనందపురం జంక్షన్‌లో వెలుగు విఒఎలు భారీ ర్యాలీ నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.రూపాదేవి, జిల్లా గౌరవాధ్యక్షులు పి.మణి మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండల కేంద్రంలో ఆందోళన చేపట్టారు.

సాహితీస్రవంతి ఆధ్వర్యంలో కర్నూలులో జనకవనం నిర్వహించారు. సాహితీ స్రవంతి రాష్ట్రకార్యదర్శి జంధ్యాల రఘుబాబు సభాధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర అధ్యక్షులు కెంగారమోహన్‌ ప్రసంగించారు. రక్షణ కల్పించాల్సిన పాలకులు మౌనం పాటిస్తున్నారని, జాతుల మధ్య చిచ్చుపెట్టి రెచ్చగొడుతున్నారని విమర్శించారు. రఘుబాబు మాట్లాడుతూ.. మహిళలను రక్షించలేని ప్రభుత్వాలకు పాలించే అర్హత లేదన్నారు. ఈ అంశంపై త్వరలో కవితా సంకలనం తీసుకువస్తామని, ప్రగతిశీల కవులతో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. కవులు జి.వెంకటకృష్ణ, కవితా వెంకటేశ్వర్లు, తెలుగు వెంకటేష్‌, ఆవుల చక్రపాణి యాదవ్‌, పులిచేరి మహేష్‌, చౌశా, ముర్తుజా, విజయులు, నాగముని, ఇనాయతుల్లా, లక్ష్మణ్‌, విశ్వనాథరెడ్డి, పానుగంటి చంద్రయ్యలు కవితలు చదివారు. సభ అనంతరం నల్లబ్యాడ్జీలు ధరించి మతోన్మాదం నశించాలని, మణిపూర్‌లో శాంతి నెలకొల్పాలని నినాదాలు చేసి నిరసన తెలిపారు. అన్నమయ్య జిల్లాలోని అంబేద్కర్‌ కూడలిలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మదనపల్లి - తిరుపతి జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో నిరసన ప్రదర్శన, మానవహారం, రౌండ్‌టేబుల్‌ సమావేశం, గుమ్మలక్ష్మీపురం, సీతంపేటలో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. విజయనగరం జిల్లాలోని డెంకాడ మండలంలో అక్కివరం వద్ద, పూసపాటిరేగలో నిరసనలు జరిగాయి. విజయవాడ లోని బీసెంట్‌ రోడ్డులోని ఎల్‌ఐసి ఆఫీసు నుంచి లెనిన్‌ సెంటర్‌ వరకు సంగమం, భారీ ప్రజాప్రదర్శన జరిగింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిర్వహించిన ఈ ర్యాలీలో మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గన్నారు. ముస్లిమ్‌ మహిళలు సైతం ప్రదర్శనలో నడిచారు. మణిపూర్‌ మారణ కాండను నిలువరించాలని, బిజెపికి దేశ ప్రజలు బుద్దిచెప్పాలని ప్రదర్శనలో నినాదాలు చేశారు. సంగమం నాయకులు శాంతిశ్రీ, సమన్విత నాయకులు, ప్రజాశక్తి బుక్‌ హౌస్‌మాజీ ఎడిటర్‌ కె ఉషారాణి, ప్రముఖ న్యాయవాది బి శ్రీదేవి, సేఫ్‌ సంస్థ నాయకులు జ్యోత్స్న, ఐద్వా నాయకులు కె స్వరూపరాణి, కె.సరోజ, పిఒడబ్ల్యు నాయకులు పద్మా, సిఐటియు, తదితర నాయకులు పాల్గొన్నారు.  58వ డివిజన్‌ ఆర్‌సిఎం చర్చి వద్ద సిపిఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ఏర్పాటు చేశారు.

నెల్లూరు జిల్లా రాపూరులో ర్యాలీ, గుంటూరు జిల్లా వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండలో బస్టాండ్‌ సెంటర్‌ నుండి శివయ్య స్తూపం సెంటర్‌ వరకు ప్రదర్శన చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో లక్కీ షాపింగ్‌ మాల్‌ కూడలి వద్ద అంగన్‌వాడీలు రాస్తారోకో చేపట్టారు. కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి.బేబీరాణి, కె.సుబ్బరావమ్మ పాల్గొన్నారు.