Apr 06,2023 20:27
  • టాప్‌సీడ్‌ నిషిమోటోపై సంచలన విజయం

ఓర్లీన్స్‌ : ఓర్లీన్స్‌ మాస్టర్స్‌ సూపర్‌-300లో భారత యువ షట్లర్‌ ప్రియాంశు రాజవత్‌ సంచలనం సృష్టించాడు. గురువారం జరిగిన రెండోరౌండ్‌ పోటీలో ప్రియాంశు వరుససెట్లలో టాప్‌సీడ్‌, జపాన్‌కు చెందిన కెంటా నిషీమోటోపై సంచలన విజయం సాధించాడు. రెండోరౌండ్‌ పోటీలో ప్రియాంశు 21-8, 21-16తో కేవలం 42 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించాడు. దీంతో ప్రియాంశు కెరీర్‌లో తొలిసారి ఓ టాప్‌సీడ్‌ ఆటగాడిపై విజయం సాధించాడు. ప్రియాంశు తొలిగేమ్‌లో 10-0పాయింట్ల ఆధిక్యతలోకి దూసుకెళ్లి ప్రత్యర్ధికి ఒక్క పాయింట్‌ కూడా గెలుచుకొనే అవకాశం ఇవ్వలేదు. ఇక రెండో గేమ్‌లో నిషిమోటో పోరాడినా ఏమాత్రం ఒత్తిడికి గురికాక మ్యాచ్‌ను ముగించాడు. క్వార్టర్‌ఫైనల్లో ఛి-యు-జాన్‌(చైనీస్‌ తైపీ)తో తలపడనున్నాడు. మరో మ్యాచ్‌లో మిథున్‌ మంజునాథ్‌ రెండోరౌండ్‌లో పోరాడి ఓడాడు. మిథున్‌ 22-24, 23-25పాయింట్ల తేడాతో ఛి-యు-జాన్‌(చైనీస్‌ తైపీ) చేతిలో పరాజయాన్ని చవిచూశాడు. ఇక మహిళల సింగిల్స్‌లో తాన్యా హేమంత్‌ 8-21, 20-22తో నిడైరా(జపాన్‌) చేతిలో ఓడారు. పురుషుల డబుల్స్‌లో 7వ సీడ్‌ ఎంఆర్‌ అర్జున్‌-ధృవ్‌ కపిల జోడీ 21-13, 22-20తో పోలండ్‌ జోడీపై, మహిళల డబుల్స్‌లో తానీషా క్రాస్టో-అశ్విని పొన్నప్ప జోడీ కూడా రెండోరౌండ్‌లోకి దూసుకెళ్లింది.