- ఎట్టి పరిస్థితుల్లో జిపిఎస్‌ను అంగీకరించం
- యుటిఎఫ్ జాతాలో నాయకులు
ప్రజాశక్తి- యంత్రాంగం : విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటాలకు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలని యుటిఎఫ్ నాయకులు కోరారు. అనంతపురం జిల్లాల్లో ప్రారంభమైన జాతా అన్నమయ్య జిల్లాకు, ఇచ్ఛాపురంలో ప్రారంభమైన మరోజాతా అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో శనివారం కొనసాగింది. కడప జిల్లాలో మైదుకూరు, బద్వేల్ మీదుగా కడప, అన్నమయ్య జిల్లా రాయచోటి, పీలేరు మీదుగా మదనపల్లెకి చేరుకుంది. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. విద్యారంగాన్ని కాపాడుకుందాం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించుకుందాం అన్న నిదానంతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు జాతాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజా సంకల్ప యాత్రలో ఉపాధ్యాయులకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తప్పారన్నారు. జిపిఎస్ రద్దుచేసి ఒపిఎస్ అమలు చేస్తామని హామీ ఇచ్చి నేడు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒపిఎస్ సాధనకు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
విశాఖ జిల్లా పెందుర్తి, ఎన్‌ఎడి జంక్షన్, కూర్మన్నపాలెంల్లోనూ, అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి, చోడవరం, మాడుగులలోనూ, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరులో కొనసాగింది. ఎక్కడికక్కడ సంఘం పతాకాలను నాయకులు ఆవిష్కరించారు. పలుచోట్ల జరిగిన సభల్లో యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్.ప్రసాద్ మాట్లాడుతూ.. జిపిఎస్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. జిఒ నంబర్ 117ను తీసుకొచ్చి 3, 4, 5 తరగతులను హైస్కూల్‌లో విలీనం చేసి ప్రాథమిక విద్యను ఛిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. యుటిఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు కె.సురేష్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ కుమార్, రాష్ట్ర కార్యదర్శులు కె.లక్ష్మీపతిరాజా, రెడ్డి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.










