Sep 26,2023 19:42

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మిగిలిన సీట్ల కోసం స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్య కమిషనరు సిహెచ్‌ నాగరాణి తెలిపారు. అక్టోబరు 3న స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు సెప్టెంబరు 30న ఆయా పాలిటెక్నిక్‌ కళాశాలల నుంచి అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను తీలుసుకోవచ్చని వివరించారు. సంబంధిత కళాశాల నోటీస్‌ బోర్డులో విభాగాల వారీ ఖాళీ సీట్ల వివరాలను పొందుపరుస్తారని పేర్కొన్నారు. స్పాట్‌ అడ్మిషన్ల ద్వారా ప్రవేశం కోరుకునే అభ్యర్థులు పాలిసెట్‌ ప్రవేశపరీక్ష రాయకపోయినా సీటు పొందవచ్చునని అన్నారు. పదోతరగతి ఉత్తీర్ణులై ఉంటే సరిపోతుందన్నారు. అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరుకావాలని తెలిపారు. ప్రైవేట్‌ కళాశాలల్లో రూ.25 వేలు, ప్రభుత్వ కళాశాలల్లో రూ.4,700 ఫీజును అక్టోబరు మూడునే చెల్లించాలని వివరించారు.