ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పాలిసెట్-2023 ప్రవేశ పరీక్ష రాయనున్న విద్యార్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు సాంకేతిక విద్య కమిషనరు సిహెచ్ నాగరాణి వెల్లడించారు. యువతను పాలిటెక్నిక్ విద్య వైపు మళ్లించే చర్యల్లో భాగంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో శిక్షణ అందిస్తున్నామని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17 నుంచి మొదటి బ్యాచ్‌కు శిక్షణ ప్రారంభమైందని, 24వ తేదీ నుంచి మరో బ్యాచ్‌కు అవకాశం ఉందని పేర్కొన్నారు. స్టడీ మెటీరియల్ కూడా ఉచితంగానే అందిస్తామన్నారు. పదో తరగతి విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మే 10న జరగనున్న పాలిసెట్ పరీక్షకు సుమారు 1,50,000 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 61 పట్టణాల్లో 410 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ నెల 30 వరకు పరీక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు.










