Sep 24,2023 21:56

ప్రజాశక్తి-జగ్గయ్యపేట/ రాజమహేంద్రవరం ప్రతినిధి :ఎన్‌టిఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని అనుమంచిపల్లి గ్రామం ఆంధ్ర, తెలంగాణ అంతరాష్ట్ర గరికపాడు చెక్‌ పోస్ట్‌ వద్ద శనివారం రాత్రి పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. డిసిపి రజిత ఆధ్వర్యంలో పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ఐటి ఉద్యోగులు రాజమహేంద్రవరం కార్ల ర్యాలీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఆదివారం తెల్లవారుజాము నుండే హైదరాబాదు నుండి విజయవాడ వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో 144 సెక్షన్‌ అమలులో ఉన్నందున ఎలాంటి నిరసనలు, ధర్నాలు, ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి వచ్చే వాహనాలు విజయవాడ వైపు రాకుండా చెక్‌పోస్టు వద్ద నిలుపుదల చేశారు. ప్రతి వాహనాన్ని పరిశీలించి నిర్థారనకు వచ్చిన తరువాతే వదిలారు.

  • విజనరీ లీడర్‌ను జైలులో పెట్టడం బాధాకరం : ఐటి ఉద్యోగులు

ఐటి ఉద్యోగులు పోలీసు నిర్బంధాన్ని దాటుకుని రాజమహేంద్రవరంలో ఉన్న నారా బ్రాహ్మణిని ఆదివారం కలిశారు. చంద్రబాబు అరెస్టు పూర్తిగా అక్రమమని, ఒక విజనరీ లీడర్‌ను జైలులో పెట్టడం బాధాకరమని అన్నారు. చంద్రబాబు అరెస్టు కక్ష పూరితమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో పని చేస్తున్న తాము రాజమహేంద్రవరం వస్తుంటే పోలీసులు అనేక ఆంక్షలు పెట్టి ఇబ్బందులు పెట్టారని తెలిపారు. తమ ఫోన్లు కూడా పోలీసులు తీసుకున్నారని.... వాట్సాప్‌ చాటింగ్‌ కూడా చెక్‌ చేశారని, ఇక్కడ హోటల్‌లో దిగితే పోలీసులు వచ్చి తమను గదిలో ఉంచి తాళాలు వేశారని వాపోయారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ తమకు మద్దతు తెలిపేందుకు హైదరాబాద్‌ నుంచి వస్తున్న ఐటి ఉద్యోగులపై ఆంక్షలు విధించడం, బెదిరింపులకు పాల్పడడం దారుణమని అన్నారు. చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు ప్రభుత్వ నిర్భందాలను దాటుకుని వచ్చిన ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు ఈ కష్ట సమయాన్ని అధికమిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.