ఒక అడవిలో నీటికొలను ఉంది. ఆ కొలనులో రకరకాల చేపలు నివసించేవి. ఆ కొలనుకి మీనకేతుడు రాజు. కొలనులోని చేపలు ఆనందంగా జీవించడానికి చక్కని సలహాలిస్తూ పాలన చేసేవాడు. ఒకరోజు కొలను దగ్గరకు కొంగల గుంపు వచ్చింది. కొలనులో చేపలు పుష్కలంగా ఉన్నాయని అవి గుర్తించాయి. ఆ కొంగల గుంపు కొలను దగ్గర మాటువేసి, ప్రతిరోజూ చేపలను ఆరగించడం మొదలుపెట్టాయి. రోజురోజుకు కొలనులో మత్స్య సంపద తగ్గిపోవడం గమనించిన మీనకేతుడు చేపల మేలుకోరి సమావేశం ఏర్పాటు చేశాడు. ఈ సమావేశానికి కొలనులోని చేపలు హాజరయ్యాయి. మీనకేతుడు చేపలను ఉద్దేశించి 'ఇటీవల మన కొలను దగ్గరకు వచ్చిన కొంగల గుంపు వల్ల మత్స్య సంపద తగ్గిపోతోంది' అని అన్నాడు. చేపలన్నీ ముక్తకంఠంతో 'అవును ప్రభు' అంటూ తలాడించాయి. అంతేకాదు, ఆ కొంగల బెడద నుండి తమను రక్షించాలని ప్రార్థించాయి. అప్పుడు మీనకేతుడు 'ఇటువంటి ఆపద సమయంలో సహనమే మన ఆయుధం అవ్వాలి. అందుకే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. పది రోజుల వరకూ కొలను లోపల నుండి నీటి పైకి రాకుండా ఉందాం. ఇది పాటించాలంటే మనందరికీ సహనం అవసరం. పిల్లలు ఆకతాయితనంతో పైకి రావడానికి ప్రయత్నిస్తారు. వాటిని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీ. మనం అలా చేస్తే పది రోజులపాటు కొంగలకు ఆహారం లభించక, అవి ఇక్కడ నుండి వెళ్లిపోతాయి. అప్పుడే మనం ఈ ప్రమాదం నుంచి బయటపడగలం' అని మీనకేతుడు చెబుతాడు. మీనకేతుడు నిర్ణయాన్ని చేపలన్నీ అంగీకరిస్తాయి. 'రేపు ఉదయం నుంచే మన ప్రణాళిక అమలుచేద్దాం. కొలను నలుమూలలా అందరూ లోపల ఉండేటట్లు, దీనికి రక్షణగా నలుదిక్కులకూ నాయకులను నియమిస్తున్నాను. వారికి కొలనులోని చేపలన్నీ సహకరించాలి' అని చెప్పి నలుగురు అనుభవజ్ఞులైన చేపలను నియమిస్తాడు. అందరూ తమ నివాసాలకు వెళ్లిపోతారు.
ఉదయం కాగానే కొంగల గుంపు ఆహారం కోసం కొలను దగ్గర మాటు వేస్తాయి. చాలాసేపు నిరీక్షించినా వాటికి చేపలు కనబడవు. అక్కడే కాసేపు నిరీక్షించినా ఆహారం దొరక్క, ఆకలి తీర్చుకోడానికి వేరేచోటుకు వెళ్తాయి. నలుదిక్కులా బాధ్యతలు తీసుకున్న చేపల నాయకులు లోపలున్న చేపలు నీటిపైకి రాకుండా తగు సూచనలు ఇస్తూ, సహనంతో బాధ్యతలు నిర్వర్తిస్తాయి. ఆకతాయి చేప పిల్లలు పైకి రావడానికి ప్రయత్నించినా, ప్రాణం విలువ చెప్పి సహన మంత్రం చెప్పి పంపుతారు.
ఇలా వారం పాటు కొంగలు కొలను దగ్గరకు రావడం, చేపల కోసం ఎదురుచూసి నీరసిస్తాయి. ఇప్పటికే మన వల్ల కొలనులో చేపలన్నీ అయిపోయి ఉంటాయి. ఇక నిరీక్షించడం వల్ల ప్రయోజనం ఉండదు. వేరే మార్గం చూడకపోతే పస్తులే అని భావించి, కొంగలు గుంపు ఆ కొలను విడిచి వేరే ప్రాంతానికి వెళ్లిపోతాయి. కొంగల గుంపు కొలను దగ్గరకు రాకపోవడాన్ని గమనించిన మీనకేతుడు మరల సమావేశం ఏర్పాటు చేస్తాడు. 'మీరంతా నా మాట విని, సహనం పాటించడం వల్లే ఈ ఆపద తప్పింది' అని చెప్తాడు. కొలనులోని చేపలు మీనకేతుడికి జేజేలు పలికి, తమ నివాసాలకు వెళ్లిపోతాయి.
మొర్రి గోపి
8897882202