- రెండు నెలల్లోనే పడిపోయిన ధర
- టన్ను రూ.23 వేల నుంచి రూ.16,900కు పతనం
- పెరిగిపోయిన కౌలు, పెట్టుబడులు
- పాత ధర కొనసాగించాలంటున్న రైతులు
ప్రజాశక్తి-ఏలూరు ప్రతినిధి : పామాయిల్ రైతుకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. దిగుబడిలేని సమయంలో మంచి ధర పలికిన పామాయిల్ పంట సీజన్ వచ్చే సరికి భారీగా తగ్గిపోయింది. ధరను నమ్ముకుని పెద్దఎత్తున కౌలుకు తీసుకున్న రైతులు రోడ్డునపడే పరిస్థితి నెలకొంది. అన్ సీజన్‌లో టన్ను రూ.23 వేలు పలికిన పామాయిల్ ధర సీజన్ వచ్చేసరికి భారీగా పతనమైంది. పాత ధరనే కొనసాగించాలంటూ రైతులు కోరుతున్నా పట్టించుకునే నాథుడేలేరు.
పామాయిల్ సాగులో ఏలూరు జిల్లా అగ్రస్థానంలో ఉంది. దాదాపు లక్షా 55 వేల ఎకరాల్లో రైతులు పామాయిల్ సాగు చేస్తున్నారు. గత కొంత కాలంగా పామాయిల్ ధర మెరుగ్గా ఉండటంతో రైతులంతా పామాయిల్ సాగుపై ఎక్కువగా మొగ్గుచూపారు. దీంతో గతంలో ఎకరాకు రూ.50 వేలు ఉన్న కౌలు రూ.1.20 లక్షలకు చేరింది. గత మే నెలలో టన్ను పామాయిల్ ధర రూ.23 వేలు పలికింది. ప్రస్తుతం టన్ను పామాయిల్ ధర రూ.16,900కు పడిపోయింది. రెండు నెలల వ్యవధిలోనే టన్నుకు రూ.6,500 వరకు ధర పతనమైంది. దీంతో పామాయిల్ రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి నెలకొంది.
పామాయిల్ సాగుకు పెట్టుబడి కింద ఎకరాకు రూ.50 వేలకుపైగా అవుతోంది. అన్ సీజన్‌లో ధర ఎక్కువగా ఉండడంతో పామాయిల్ పంట సాగుకు రైతులు ఎకరాకు లక్ష రూపాయలకుపైగా కౌలు చెల్లిస్తున్నారు. పంట దిగుబడి అత్యధికంగా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలోనే వస్తోంది. ఈ సీజన్‌లో నెలకు మూడు టన్నుల వరకూ దిగుబడి వస్తుంది. మిగిలిన నెలల్లో నెలకు పది క్వింటాళ్లు రావడమే గగనంగా ఉంటుంది. అన్ సీజన్‌లో టన్ను రూ.23 వేలు పలికిన పామాయిల్ ధర సీజన్ వచ్చేసరికి రూ.16,900కు పతనం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
టన్నుకు రూ.23 వేల ధర ఉంటే పెట్టుబడి, కౌలుపోను ఎకరాకు రూ.2.30 లక్షలు వరకు రైతుకు ఆదాయం వచ్చేది. ఇప్పుడు టన్ను రూ.16,900కు పడిపోవడంతో ఎకరాకు రూ.లక్షన్నర ఆదాయం రావడమే గగనంగా మారింది. దిగుబడి తగ్గడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. ప్రతినెలా అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా, పంట రికవరీ శాతం అధారంగా ధరల కమిటీ ధరలను నిర్ణయిస్తుంది. వచ్చే సెప్టెంబర్ నెలలో ధర మరింత భారీగా తగ్గే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. అదే జరిగితే పామాయిల్ రైతులు మరింత నష్టపోయే ప్రమాదం ఉంది. మే నెలలో ఉన్న టన్నుకు రూ.23 వేల ధరను కొనసాగించాలని, ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించి ఆదుకోవాలని రైతుల కోరుతున్నారు.
పంట వచ్చే సమయంలో ధర తగ్గించారు
'పది ఎకరాల్లో పామాయిల్ సాగుచేశాను. మే నెలలో టన్ను రూ.23 వేలు ఉన్న ధర కాస్తా ఇప్పుడు రూ.16,900కు పడిపోయింది. ఒక్కసారిగా ధర పడిపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. కౌలు, పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో పెద్దఎత్తున రైతులకు నష్టం వాటిల్లుతోంది.'
బిక్కిన వెంకటేశ్వరరావు, పాములవారిగూడెం, జీలుగుమిల్లి మండలం
ధరల మార్పుతో తీవ్రనష్టం
'పామాయిల్ ధరలు ప్రతినెలా మారుతున్నాయి. రెండు నెలల వ్యవధిలో టన్నుకు రూ.6,500 ధర తగ్గిపోయింది. నిలకడలేని ధరలతో నష్టాలు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. మే నెలలో ఇచ్చిన టన్నుకు రూ.23 వేలు ధరను కొనసాగించాలి. లేకపోతే అప్పులే మిగులుతాయి
సింహాద్రి శ్రీనివాసరావు, జీలుగుమిల్లి మండలం.
పాత ధర కొనసాగించాలి
'పామాయిల్ ధర ఒక్కసారిగా తగ్గిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ముఖ్యంగా కౌలు రైతులు పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ధర ఉండటంతో పెద్దఎత్తున కౌలు చెల్లించి తోటలు తీసుకున్నారు. ధర తగ్గిపోవడంతో అప్పులపాలువుతున్నారు. మే నెలలో ఇచ్చిన టన్నుకు రూ.23వేల ధరను రైతులకు అందించాలి. లేకపోతే రైతులతో కలిసి పెద్దఎత్తున ఆందోళన చేపడతాం'
కె.శ్రీనివాస్,
రైతు సంఘం జిల్లా కార్యదర్శి










