- విజయవాడకు తరలించిన పోలీసులు
ప్రజాశక్తి - పరవాడ (అనకాపల్లి) : అనుచిత వ్యాఖ్యల విషయమై టిడిపి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి రోజాపై చేసిన అనిచిత వ్యాఖ్యలపై ఒక కేసు, సిఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలపై రెండు కేసులు సత్యనారాయణపై నమోదైనట్టు పోలీసు అధికారులు తెలిపారు. తొలుత మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. తన ఇంటి తలుపులను సత్యనారాయణమూర్తి తెరవకపోవడంతో పోలీసులు హడావుడి చేశారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్న సత్యనారాయణకు వైద్య పరీక్షలు చేయించేందుకు టిడిపి నేతలు ప్రయత్నించారు. ఆయన ఇంటికి వచ్చిన ప్రయివేటు అంబులెన్స్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు బండారు ఇంటి తలుపులు బద్దలు కొట్టి పోలీసులు నోటీసులు అందజేశారు. 41 ఎ, 41 బి సెక్షన్ల కింద ఈ నోటీసులు అందజేసినట్లు వెల్లడించారు. అనంతరం అరెస్టు చేసి ఆయనను విజయవాడకు తరలించారు. సత్యనారాయణ మూర్తికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. ప్రతిపక్షాలే లక్ష్యంగా కక్ష సాధింపులకు దిగడం కొందరు పోలీసులకు పరిపాటిగా మారిందని లోకేష్ మండిపడ్డారు.

ఆదివారం రాత్రి నుంచే అరెస్టు ప్రయత్నాలు
బండారును అరెస్టు చేసేందుకు ఆదివారం రాత్రి 11 గంటల గంటల నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండారుపై చర్యలు తీసుకోవాలని గత నెల 30న డిజిపిని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు. దీంతో గుంటూరు పోలీసులు రంగంలోకి దిగారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు సుమారు 300 మంది పోలీసులు బండారు ఇంటి వద్ద మోహరించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు టిడిపి కార్యకర్తలు సుమారు 1600 మంది ఆయన ఇంటికి చేరుకోవడంతో తొలుత పోలీసులు ఆలోచనలో పడ్డారు. బండారుకు తోడుగా మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, తదితరులు ఉన్నారు. చివరకు బండారు ఇంట్లోకి వెళ్లి ఆయనను అరెస్టు చేశారు.










