Jul 09,2022 09:59
  • విశాఖ ఉక్కు పోరు ప్రస్తావన శూన్యం
  • ప్లీనరీలో తొలి రోజు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అట్టహాసంగా ప్రారంభమైన వైసిపి తొలిరోజు ప్లీనరీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలకే పరిమితమైంది మూడేళ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ మంత్రులు, ఎంఎల్‌ఏల ప్రసంగాలు కొనసాగాయి. ఆమోదించిన తీర్మానాలు కూడా వాటికే పరిమితమైనాయి. అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలు తొలిరోజు ప్లీనరీలో చర్చకు రాలేదు. ప్రత్యేక హోదా, విభజన హామీల ఊసు లేదు. ఏడాదికి పైగా సాగుతున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక పోరు ప్రస్తావన కూడా రాలేదు. విశాఖ రైల్వే జోన్‌,కడప ఉక్కు, ఓడరేవుల అభివృద్ధి తదితర అంశాలదీ కూడా ఇదే పరిస్థితి,. రాష్ట్ర అభివృద్దికి కేంద్రం సహకరించకపోయినా ఆ అంశమూ లేదు. రాష్ట్ర ప్రభుత్వం తరచు కేంద్రానికి విజ్ఞప్తి చేసే నిధుల గురించి కూడా తొలిరోజు చర్చకు నోచుకోలేదు. ఇటీవల ప్రధానమంత్రి భీమవరం పర్యటనకు వచ్చినప్పుడు సిఎం జగన్‌ ఇదే అంశాలపై గన్నవరం విమానాశ్రయంలో వినతిపత్రం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన అంశాల ప్రస్తావన కూడా ప్లీనరీలో చేయకపోవడం గమనార్హం. రాజధాని ప్రస్తావనకూడా తొలిరోజు రాలేదు. తీర్మానాల సంగతి అటు ఉంచితే, ముఖ్యమంత్రి, మంత్రుల ప్రసంగాల్లోనూ ఈ అంశాల ఊసులేకపోవడం చర్చనీయాంశమైంది. మహిళాసాధికారితపై జరిగిన చర్చలో ఇద్దరు మంత్రులు, ముగ్గురు మహిళా నాయకులు మాట్లాడారు. అయితేదిశ చట్టం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ చట్టాన్ని ఆమోదించి పంపాలని కూడా కేంద్రాన్ని కోరలేకపోయారు. . ప్లీనరీ ప్రాంగణంలో పోలవరం ప్రాజెక్టు నమూనాను ప్రదర్శించారు. పోలవరం జలాశయం గేట్లు ద్వారా నీటి విడుదల అవుతున్నట్టు నమూనాలో చూపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం, కేంద్రం సకాలంలో నిధులు ఇవ్వకపోవడం తదితర అంశాలు కూడా ప్రస్తావనకు రాలేదు. తొలి రోజు సిఎం జగన్‌, వైఎస్‌ విజయమ్మ, మంత్రి ధర్మాన ప్రసాదరావు తదితరులు కీలక ఉపన్యాసాలు చేశారు. తరువాత తీర్మానాల రూపంలో మొత్తం ఐదు అంశాలపై చర్చ జరుగుతుందని ప్రకటించగా నిర్ధేశిత సమయం ప్రకారం ఐదు గంటల కల్లా ముగించారు.దీంతో మహిళా సాధికారిత, విద్య, నవరత్నాలు, వైద్య ఆరోగ్యంపైనే చర్చ జరిగింది. పరిపాలనలో పారదర్శకత అనే అంశంపై కూడా తొలిరోజు చర్చజరగాల్సి ఉండగా సమయం పూర్తయిందని ఈ అంశాన్ని శనివారానికి వాయిదా వేస్తున్నట్టు పార్టీ క్రమ శిక్షణా కమిటీ చైర్మన్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ శ్రేణులతో ప్లీనరిజరుగుతున్న ప్రాంతంలోనే గాక గుంటూరు, విజయవాడ నగరాలు క్రిక్కిరిసి పోయాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ విజయమ్మల ప్రసంగం ముగిశాక పార్టీ జమా ఖర్చుల వివరాల తీర్మానం ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయ సాయిరెడ్డి ప్రవేశపెట్టగా ప్లీనరీ ఆమోదించింది. అలాగే వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ విధాన పరమైన అంశాలపై రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడారు. విజయమ్మ రాజీనామా ప్రకటన చేస్తున్నప్పుడు పలువురు కార్యకర్తలు వద్దు,వద్దు అంటూ చేతులు ఊపడం కనిపించింది.
 

                                                                      నేడు జగన్‌ కీలక ప్రసంగం

వైసిపి ప్లీనరీలో శుక్రవారం ప్రారంభోపన్యాసం చేసిన సిఎం జగన్‌ శనివారం ముగింపు ఉపన్యాసం చేయనున్నారు. రాబోయే రెండేళ్లలో చేపట్టబోయే కార్యక్రమాలు, 2024లో మళ్లీ అధికారంలోకి రావడం కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఆయన తన ప్రసంగంలో ప్రస్తావిస్తారని చెబుతున్నారు. ముగింపుసభకు మరింతగా జనసమీకరణ చేయాలని వైసిపి నాయకులు పార్టీ ఉమ్మడి కృష్ణా,గుంటూరు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలకు సూచించారు.