Oct 04,2023 21:35
  •  కేంద్రం మద్దతివ్వాలి
  • నాకున్న సమాచారంతోనే మాట్లాడాను : పవన్‌ కల్యాణ్‌

ప్రజాశక్తి-కృష్ణా ప్రతినిధి : త్వరలో జనసేన-టిడిపి సంయుక్త మ్యానిఫెస్టో రానుందని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. జనం బాగుపడాలంటే రాష్ట్రంలో దుష్టపాలన చేస్తోన్న జగన్‌ ప్రభుత్వం పోవాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, రాష్ట్రాభివృద్ధికి వచ్చే ఎన్నికల్లో జనసేన-టిడిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. తమ సంకీర్ణ కూటమికి కేంద్రం మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లాలో పవన్‌ చేపట్టిన వారాహి విజయయాత్ర నాలుగో రోజైన బుధవారం పెడనలో సాగింది. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులున్నాయని విమర్శించారు. సభ జరపాలన్నా సమస్యగా మారిందని ఆక్షేపించారు. రాష్ట్రంలోకి రావాలన్నా వీసా, పాస్‌పోర్టు అడిగేలా పరిస్థితి ఉందని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సరికాదన్నారు. చంద్రబాబు అనుభవానికి జనసైనికుల బలం తోడైతే వైసిపిని భూస్థాపితం చేయవచ్చని పేర్కొన్నారు. త్వరలోనే టిడిపి, జనసేన చర్చించుకుని రాష్ట్రాభివృద్ధికి అన్ని వర్గాలకూ మేలు జరిగేలా మ్యానిఫెస్టో తీసుకొస్తామన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు వైసిపికి 151 మంది ఎంఎల్‌ఎలను, 22 మంది ఎంపిలను ఇచ్చినా రాష్ట్ర రాజధాని నిర్మాణంలో, విభజన హామీల అమలులో ముఖ్యమంత్రి జగన్‌ విఫలమయ్యారని విమర్శించారు. విశాఖ ఉక్కును ప్రయివేటీకరించొద్దని, ఈ ఫ్యాక్టరీ అభివృద్ధికి నిధులు అవసరమని కేంద్రాన్ని అడగలేకపోయారని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని, యువతకు ఉద్యోగాలు దొరకడం లేదని తెలిపారు. ఉద్యోగాలు ఏవని ప్రశ్నిస్తే గ్రామ సచివాలయాలు, వార్డు వలంటీర్ల లెక్కలను రాష్ట్ర ప్రభుత్వం చూపుతోందని విమర్శించారు. జనసేన, టిడిపి ప్రభుత్వం అధికారంలోకొస్తే అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని, యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పోలీసుల నోటీసులపై స్పందించారు. గతంలో తాను చిత్తూరు జిల్లాకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని, దీనిపై పోలీసులను ప్రశ్నించగా తాను వెళ్లే ప్రాంతంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని తెలిపారన్నారు. ఇందుకు సంబంధించి మీ వద్ద ఏ సమాచారం ఉందని ప్రశ్నిస్తే, ఇన్‌పుట్‌ ఉందని చెప్పి తన పర్యటనను అప్పట్లో అడ్డుకున్నారని వివరించారు. వారాహి విజయయాత్రలో పెడనలో అల్లర్లు సృష్టించడానికి, రాళ్ల దాడికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రయత్నిస్తోందని నాకున్న సమాచారం మేరకు మాట్లాడానని తెలిపారు. దీనికి ఆధారాలు చూపాలని పోలీసులు నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. దాడులు జరగకుండా నియంత్రించాల్సిన బాధ్యత పోలీసులదని తెలిపారు. పోలీసులు వైసిపి కార్యకర్తల్లా వ్యవహరించకూడదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, చట్టప్రకారం వ్యవహరించాలని అన్నారు. ఈ సభకు జనసేన, టిడిపి నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

  • పవన్‌ కల్యాణ్‌కు పోలీసుల నోటీసులు

దీనికి ముందు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌కు బుధవారం కృష్ణా జిల్లా బందర్‌లో పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారాహి యాత్రపై రాళ్ల దాడికి ప్లాన్‌ జరిగిందని పవన్‌ కల్యాణ్‌ చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు ఏవైనా ఉన్నాయా? అని ఈ నోటీసులో ప్రశ్నించారు. 'పవన్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అందుకే నోటీసులు ఇచ్చాం. దాడులు జరుగుతాయనే సమాచారం మీకు ఎక్కడి నుంచి వచ్చిందనేది మాకు తెలియజేయాలని కోరాం. సరైన ఆధారాల్లేకుండా వ్యాఖ్యలు, ఆరోపణలు చేయకూడదు. బాధ్యతారాహిత్యంగా ఆరోపణలు చేస్తే పర్యవసానాలు ఉంటాయి. రెచ్చగొట్టే భాష, సైగలు మానుకుని మాట్లాడాలి. పవన్‌ కంటే నిఘా వ్యవస్థ మాకు బలంగా ఉంది. అసాంఘిక శక్తులుంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం' అని జిల్లా ఎస్‌పి జాషువా పేర్కొన్నారు.