Oct 18,2022 07:28

రాష్ట్ర విభజన సమస్యల నుంచి నవ్యాంధ్ర ఇంకా కోలుకోకపోగా, అది చాలదన్నట్లు కొత్తగా రాజధాని సమస్యను ఏలికలు తెరపైకి తెచ్చి చలి కాచుకోవడం ఆందోళనకరం. ఎనిమిదేళ్లు దాటినా ఇంకా రాజధాని చిక్కులను తొలగించకుండా అనిశ్చితిని కొనసాగించడం రాష్ట్ర ప్రయోజనాలకు నష్టదాయకం. టిడిపి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించగా, వైసిపి అంగీకరించి...అధికారంలోకి రాగానే వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల చట్టం చేయడంతో న్యాయపరమైన చిక్కులు తలెత్తాయి. అమరావతికి భూములిచ్చిన రైతులు తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ఉద్యమిస్తున్నారు. ప్రభుత్వం ఆంక్షలు, నిర్బంధాలను ప్రయోగిస్తూ వస్తోంది. మూడు రాజధానులకు మద్దతుగా అడపాదడపా పోటీ దీక్షలు ఉండనే ఉన్నాయి. కాగా ఈ ఏడాది మార్చిలో అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ప్రభుత్వం తెచ్చిన మూడు రాజధానుల చట్టాన్ని హైకోర్టు కోట్టేసింది. ఆర్నెల్లలో అభివృద్ధి చేయాలని డెడ్‌లైన్‌ విధించింది. అందుకు ఐదేళ్లు కావాలని అఫిడవిట్‌ ఇచ్చిన ప్రభుత్వం, ఈ మధ్యనే హైకోర్టు తీర్పును నిలుపుదల చేయాలని స్టే కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
         అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ భూములిచ్చిన రైతులు అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లికి గత నెల 9న పాదయాత్ర కట్టగా నిబంధనల మాటున అడ్డుకోవాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు పారలేదు. పాదయాత్రకు హైకోర్టు అనుమతిచ్చింది. అప్పటి నుంచి అధికారపార్టీ ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టడం మొదలు పెట్టింది. పరాకాష్ట శనివారం విశాఖలో నిర్వహించిన 'ఉత్తరాంధ్ర గర్జన'. రాజకీయేతర జెఎసి అన్నప్పటికీ వైసిపి మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంపిలు, ఎంఎల్‌సిలు, నాయకులు ఆ కార్యక్రమానికి హాజరై ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టడం దిగ్భ్రాంతికరం. శాసనసభ స్పీకర్‌ సైతం గొంతు కలపడం ఆశ్చర్యకరం. సరిగ్గా ఇప్పుడే పాదయాత్ర విజయవంతానికి ప్రతిపక్ష టిడిపి సమావేశాలు నిర్వహించడంతో రాజకీయ వేడి పెరిగింది. అది చాలదన్నట్లు ఇప్పుడే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ విశాఖ పర్యటన పెట్టుకోవడం, మంత్రులపై రాళ్ల దాడి జరగడం, పవన్‌ పర్యటనపై ఆంక్షలు పెడుతూ పోలీసులు నోటీసులివ్వడంతో ఉద్రిక్తత అధికమైంది.
హఠాత్తుగా ఉత్తరాంధ్ర వెనకబాటుపై ఏలిన, ఏలుతున్న పార్టీలు కంటతడి పెట్టడం విడ్డూరం. వైసిపి వచ్చి మూడేళ్లవగా ఉత్తరాంధ్రలో కొత్తగా చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆ ప్రాంత ప్రజలే చెపుతున్నారు. సుజల స్రవంతి, పోలవరం, వంశధార ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లున్నాయి. విశాఖ అభివృద్ధిలో కీలకమైన స్టీల్‌ప్లాంట్‌ను కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రైవేటీకరిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వైసిపి నిలదీయదు. ప్రతిపక్ష టిడిపిదీ అదే వరస. బిజెపితో అంటకాగుతున్న పవన్‌ కళ్యాణ్‌ సైతం ప్రశ్నించింది లేదు. విభజన హామీ రైల్వే జోన్‌పైనా ఆ మూడు పార్టీలదీ అదే తీరు. మెట్రో రైలు, వెనకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజి, వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధి నిధులు...వేటినీ బిజెపి ఇవ్వలేదు. రాజధానికి చట్ట ప్రకారం నిధులివ్వాల్సిన కేంద్ర బిజెపిది ఒక మాట కాగా రాష్ట్ర పార్టీ లీడర్లు ఏ ప్రాంతంలో ఆ పాట పాడుతున్నారు. ఈ సమయంలో కేపిటల్‌పై నెలకొన్న ఉద్రిక్తతలు అసలు సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయి. ఆ మూడు పార్టీలూ ప్రధాన దోషి బిజెపిని బోనులో నిలబెట్టట్లేదు. విశాఖ భూకుంభకోణంపై చంద్రబాబు ప్రభుత్వం ఒక సిట్‌ వేయగా, జగన్‌ సర్కారు వేరొక సిట్‌ వేసింది. ఎంతకీ ఆ నివేదికలు వెలుగు చూడట్లేదంటే రెండు పార్టీలూ పరస్పరం సహకరించుకుంటున్నాయనే అర్థం. పాత, కొత్త భూబాగోతాలపై సమగ్రంగా విచారించి అసలు దోషులపై చర్యలు చేపడితే ప్రజలు సంతోషిస్తారు. రాజధానిగా అమరావతిని నిర్ణయించడంలో నాడు అసెంబ్లీలో గొంతు కలిపిన వైసిపి ఆ మాటకు కట్టుబడాలి. అమరావతిని రాజధానిగా కొనసాగించి అభివృద్ధి చేయాలి. అన్ని ప్రాంతాలకూ అభివృద్ధిని వికేంద్రీకరించాలి.