ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు సహా ఇతర పరిణామాలపై ఎన్‌ఎస్‌జి కేంద్ర హోంశాఖకు నివేదిక అందించింది. సెప్టెంబరు 8వ తేదీ అర్ధరాత్రి నుంచి 10వ తేదీ అర్ధరాత్రి 1 గంట వరకు నంద్యాల, విజయవాడ, రాజమహేంద్రవరంలో జరిగిన పరిణామాలు, జైల్లో భద్రత తదితర అంశాలను నివేదికలో పేర్కొంది. తొమ్మిదో తేదీ ఉదయం 6 గంటలకు నంద్యాలలో అరెస్టు చేశాక ఎన్‌ఎస్‌జి రక్షణలో వున్న చంద్రబాబును రోడ్డు మార్గంలో విజయవాడకు తొమ్మిది గంటలపాటు తరలింపు అంశాన్ని వివరించింది. 10వ తేదీ తెల్లవారుజాము 3:30 గంటల నుంచి సిట్ కార్యాలయం నుంచి విజయవాడలోని జిజిహెచ్‌కు ఆ తర్వాత ఎసిబి కోర్టుకు తరలించిన తీరును వివరించింది. భద్రతా పరంగా అంత పటిష్టంగా లేని ఎసిబి కోర్టు హాలు వెలుపల ఆయన్ను వుంచినట్లు పేర్కొంది. అలాగే అదేరోజు రాత్రి 9:29 నిమిషాలకు వర్షంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారని రిపోర్టులో పేర్కొంది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ప్రస్తుతం ఆయన భద్రత ఏమిటన్న విషయాన్ని కూడా ఎన్‌ఎస్‌జి ప్రస్తావించింది. జైలు ఆవరణలోకి వెళ్లే సమయంలో కొన్ని భద్రతా లోపాలు గుర్తించినట్లు పేర్కొంది. మొత్తం నివేదికను చంద్రబాబు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎన్‌ఎస్‌జి సిబ్బంది ఎన్‌ఎస్‌జి ప్రధాన కార్యాలయంతోపాటు కేంద్ర హోంశాఖకు నివేదికను అందజేసింది.










