ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి, అనకాపల్లి విలేకరి :సహకార రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించాలని మోడీ ప్రభుత్వం చేస్తోన్న కుట్రలను పోరాటాలతో తిప్పికొట్టాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు.కార్పొరేట్లను వెనక్కు నెట్టి సహకార రంగాన్ని పరిరక్షించుకోవాలన్నారు. 'సహకార రంగాన్ని కాపాడుకుందాం' అనే అంశంపై అనకాపల్లిలోని కార్మిక, కర్షక భవన్‌లో బుధవారం సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.అప్పలరాజు అధ్యక్షతన రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సులో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ.. గత ప్రభుత్వ విధానాల కారణంగా నాశనమైన సహకార రంగాన్ని సరిదిద్దుతామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, సహకార వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తున్న మోడీ ప్రభుత్వానికి వంతపలకడం విచారకరమన్నారు. కార్పొరేట్లకు లాభాలు చేకూర్చడం కోసం సహకార వ్యవస్థను కార్పొరేట్ల చేతుల్లో పెట్టాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ప్రయివేటు కంపెనీ, అసంఘటితరంగం, గ్రామీణ ప్రాంతంలో సహకార సొసైటీలు ఏర్పాటు చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కేరళలో సహకార రంగాన్ని అభివృద్ధి చేయడంతో మూడు లక్షల మందికి ఉద్యోగాలు లభించడంతో పాటు స్వతంత్రంగా సొసైటీల ద్వారా తమ అవసరాలను తీర్చుకోగలుగుతున్నారని తెలిపారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.అజరుకుమార్ మాట్లాడుతూ... సహకార రంగాన్ని ప్రత్యామ్నాయ రంగంగా అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. సహకార సంఘాల్లో సభ్యులుకాని వారికి నామినేషన్ పద్ధతిపై చైర్మన్ పదవులు ఇవ్వడం సహకార రంగం స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. 50 శాతం షేర్లు ప్రయివేటు వ్యక్తులకు, కంపెనీలకు అప్పగించే ఎంఎసి చట్టాన్ని రద్దు చేయాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం మాట్లాడుతూ.. సహకార సుగర్ ఫ్యాక్టరీలను పునరుద్ధరించాలని, అమూల్‌కు ప్రభుత్వ మద్దతు ఉపసహరించుకోవాలని, సొసైటీలకు రాయితీలిచ్చి ప్రోత్సహించాలని డిమాండ్‌చేశారు. తొలుత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ చిత్రపటానికి వి.కృష్ణయ్య, లోకనాథం, అప్పలరాజు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సహకార సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ రెడ్డివెంకటరావు, గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ చైర్మన్ గంటా శ్రీరామ్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు, ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి, ఆర్‌ఇసిఎస్ యూనియన్ నాయకులు మళ్ల పరదేశినాయుడు, రాష్ట్ర సహకార, ఉద్యోగ సంఘాల ప్రధాన కార్యదర్శి పి.సత్యనారాయణ, స్టీల్ ప్లాంట్ త్రిఫ్ట్ సొసైటీ నాయకులు డిఎస్‌ఆర్‌సి మూర్తి, పిఎసిఎస్, పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్, రైతు సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.










