Oct 11,2022 10:25

ప్రజాశక్తి-యంత్రాంగం : గర్జన సభపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఆయనపై పలువురు రాష్ట్ర మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు మాటలు విని ప్రభుత్వ అభివృద్ధి కార్యకలాపాల గురించి ప్రశ్నించడం తగదని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. విశాఖలోని ప్రభుత్వ అతిథి గృహంలో వారు మీడియాతో మాట్లాడారు. షూటింగుల మధ్యమధ్యలో ప్రెస్‌ మీట్లు పెడుతూ కాలక్షేపం చేస్తున్నారని, ఖాళీగా ఉన్నప్పుడు ట్వీట్లు పెడుతూ ప్రజలను గందర గోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునే యాత్రలను ఆపాలన్నారు. బిజెపి నాయకులకు విశాఖపట్నంపై ప్రేమ ఉంటే ముందు స్టీల్‌ప్లాంటు అమ్మకాన్ని అడ్డు కోవాలని డిమాండ్‌ చేశారు. రైతుల ముసుగులో టిడిపి నేతలు విద్వేషాలను రెచ్చగొడుతున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కుంభకర్ణుడిలా ఆరు నెలలు నిద్రపోయి.. అప్పడప్పుడూ ట్వీట్‌ చేస్తుంటారని ఆమె ఎద్దేవా చేశారు. టిడిపి, బిజెపితో జత కట్టినప్పుడు ఉత్తరాంధ్రలో వలసలు గుర్తురాలేదా? అని ప్రశ్నించారు.
        చంద్రబాబు చేతిలో పవన్‌ కల్యాణ్‌ కీలుబొమ్మగా మారారని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్‌ విమర్శించారు. గ్రౌండ్‌ రియాలిటీస్‌ తెలియకుండా చంద్రబాబు ఏ ట్వీట్‌ పెట్టమంటే పవన్‌ ఆ ట్వీట్‌ పెడతారని పేర్కొన్నారు.