Jul 14,2022 13:13

ప్రజాశక్తి-మైలవరం (ఎన్టీఆర్‌ జిల్లా) : మైలవరం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలను స్థానిక జడ్పీ హైస్కూల్లో విలీనాన్ని ఆపాలని డిమాండ్‌ చూస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో స్కూల్‌ ఆవరణలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ మాజీ జిల్లా నాయకులు సిహెచ్‌ సుధాకర్‌, మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్‌ 117 ను తీసుకొచ్చి మూడు కిలోమీటర్లు లోపల ఉన్న పాఠశాలలను విలీన ప్రక్రియ ప్రారంభించిందని, ఇది అత్యంత దుర్మార్గమైన చర్యని అన్నారు. స్వాతంత్ర అనంతరం వందలాదిమంది పిల్లలకు విద్యను అందించిన పాఠశాలలను విలీనం పేరుతో మూసివేయడం దుర్మార్గమైన చర్యని అన్నారు. నెంబర్‌ 4 పాఠశాలకు మైలవరం ప్రాంతంలో ఎంతో చరిత్ర ఉందని, అంతేకాకుండా నాడు నేడు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలకు వెచ్చించి అభివృద్ధి చేసిందని, 140 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలను రెండు కిలోమీటర్ల దూరం ఉన్న బార్సు హై స్కూల్‌ లో విలీనం చేయటం అత్యంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అన్నారు. చిన్నపిల్లలు రెండు కిలోమీటర్ల పైగా నడిచి వెళ్లడం దూరం అవుతుందని, భవిష్యత్తులో మరింత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పాఠశాలను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులు తల్లిదండ్రులతో విద్యార్థులను కలుపుకొని ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు కుమార్‌ నాయక్‌, మైలవరం ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షులు కాపా దేవేంద్రనాథ్‌, జిల్లా నాయకుడు దొండపాటి విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.