- కుకీలు మయన్మార్ నుంచి వచ్చిన వారిగా చిత్రీకరణ
- అన్నదమ్ముల్లాంటి కుకీ, మెయితీల మధ్య విద్వేష వాతావరణం
న్యూఢిల్లీ నుంచి ప్రజాశక్తి ప్రతినిధి జె.జగదీశ్వరరావు : మణిపూర్‌లో సంఫ్‌ుపరివార్ ఏమి విత్తుతుందో అదే పంట వస్తోంది. ఇక్కడ, ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు గల సంస్థలు ద్వేషపూరిత ప్రచారంలో విస్తృతంగా ఉపయోగించే రెండు అంశాలు కొండ ప్రాంతంలో గసగసాల సాగు, అటవీ నిర్మూలన. ఈ రెండు సమస్యలకు కుకీలే కారణమని కొన్నాళ్లుగా మెయితీల మెదళ్లలోకి ఆర్‌ఎస్‌ఎస్ బలంగా ఎక్కించింది. ఇందుకోసం ఆన్‌లైన్ మీడియాను పెద్దయెత్తున దుర్వినియోగపరిచింది. అన్నదమ్ముల్లాంటి కుకీ, మెయితీల మధ్య చిచ్చుకు దీన్నే ఆయుధంగా చేసుకుంది. మణిపూర్ హైకోర్టు మెయితీలకు షెడ్యూల్డ్ తెగ హోదాను ఇవ్వడాన్ని పరిగణలోకి తీసుకున్న తరువాత, రాష్ట్రంలో చెలరేగిన అల్లర్లు దాదాపు 82 రోజులుగా రగులుతున్నాయి.
మణిపూర్‌లోని పర్వత ప్రాంతంలో 15,000 ఎకరాలకు పైగా గసగసాలు పండిస్తున్నమాట నిజమే. దీనిని కుకీ రైతులే కాదు ఇతరులు కూడా పండిస్తారు. ఇదే వారి ప్రధాన ఆదాయ వనరు. డ్రగ్స్ మాఫియాతో గసగసాల సాగుకు ముడిపెట్టి ప్రచారం చేయడం దారుణం. గసగసాలు తినదగినవి. దీని పూలను డ్రగ్స్ తయారీకి వాడతారు. డ్రగ్స్ మాఫియా మెయితీ వర్గానికి చెందిన రాజకీయ నాయకులు, వ్యాపారుల చెప్పుచేతుల్లోనే ఉంది. అటవీ సంపద కొల్లగొట్టడంలోనూ మెయితీలే ముందుంటారు. నరికిన చెట్లను మెయితీ అధినేతలు కొనుగోలు చేస్తారు. కుకీలు దీని నుంచి చిన్న మొత్తాన్ని పొందుతారు. ఈ అడవిని మెయితీ వ్యాపారులు స్వాధీనం చేసుకోవాలని కుట్ర పన్నుతున్నారు. మాఫియా గ్రూపులను అణిచివేసేందుకు చర్యలు తీసుకోకపోగా, కుకీ వ్యతిరేక ప్రచారానికి సంఫ్‌ు పరివార్, బిజెపి ప్రభుత్వం నాయకత్వం వహిస్తున్నాయి. మరోవైపు దశాబ్ధాలుగా నివాసముంటున్న కుకీలు మయన్మార్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వాళ్లగా చిత్రీకరిస్తూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఈ విషపూరిత వాతావరణమే మణిపూర్ తగలబడడానికి ప్రధాన హేతువు. ఇప్పుడు లోయలో కుకీలు, పర్వత ప్రాంతాల్లో మెయితీలు నివసించడం అసాధ్యం. ఇంతగా మతపరమైన దాడులు జరిగాయి. కుకీలు ఎక్కువగా క్రైస్తవులు కావడంతో సంఫ్‌ు పరివార్ కుకీ వ్యతిరేక ప్రచారం ముసుగులో క్రైస్తవ వ్యతిరేకతను చాటగలిగింది. లోయలోని మెయితీ క్రైస్తవులకు చెందిన 276 చర్చిలను కూల్చివేయడమే ఇందుకు నిదర్శనం. ఈ చర్చిలు సాధారణంగా తాత్కాలిక నిర్మాణాలు. వీటితోపాటు బాగా కట్టిన 25 చర్చిలు కూడా ధ్వంసమయ్యాయి.
మణిపూర్ ఘర్షణల్లో బిజెపి రహస్యంగా, బహిరంగం గా మద్దతిచ్చే ఉగ్రవాద సంస్థలైన అరంబై తెంగోల్, మెయితీ లీపున్ ఒకవైపు, కుకీ సాయుధ గ్రూపులు మరోవైపు ఉన్నాయి. మెయితీ దుండగులు యథేచ్ఛగా చెలరేగు తుండగా రాష్ట్ర పోలీసులు మౌన ప్రేక్షకుల్లా ఉండిపో యారు. పోలీసు ఆయుధాల నుంచి నాలుగు వేలకుపైగా తుపాకులు ఎలా మాయమయ్యాయన్న ప్రశ్నకు సమాధానం లేదు. అదే సమయంలో, ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ కూడా నలభై కుకీ ఉగ్రవాదులను చంపామని పేర్కొన్నారు. 2017 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ మాత్రం కుకీ తిరుగుబాటు సంస్థలతో రహస్య చర్చలు జరిపారు.
హింసాకాండలో వంద మందికి పైగా మరణించినట్లు అధికారికంగా ధ్రువీకరించిప్పటికీ, వివిధ ఏజెన్సీలు సుమారు 200 దాకా మరణాలు సంభవించినట్లు సూచిస్తున్నాయి. వెయ్యి మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఐదు వేలకు పైగా ఇళ్లు దగ్ధమయ్యాయి. దాదాపు రెండు వందల గ్రామాలు అగ్నికి ఆహుతయ్యాయి. 60,000 మంది శరణార్థులుగా మారారు. మూడు, నాలుగు అంతస్తుల ఇళ్లు నేలమట్టమయ్యాయి. రాష్ట్రంలోని సీనియర్ నేతలకు కూడా భద్రత లేదు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వోద్యోగుల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయి. మాజీ సైనికుని భార్యతో సహా మరో ఇద్దరిని వివస్త్రలను చేసి ఊరేగించారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయి.
స్వాతంత్ర సమరయోధుని భార్యను సజీవ దహనం చేశారు. హత్యకు గురైన కుకీల మృత దేహాలు ఇంఫాల్‌కు కూడా చేరుకోలేక మార్చురీలో కుప్పలుగా పోసి ఉన్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి, మణిపూర్ లోక్‌సభ సభ్యుడు రాజ్‌కుమార్ రంజన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్‌లో పరిస్థితిపై మాజీ ఆర్మీ స్టాఫ్ విపి మాలిక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జనరల్ నిశికాంత సింగ్ దీనస్థితిని ట్విట్టర్‌లో పంచుకున్నారు. మణిపూర్ పరిస్థితి లెబనాన్ పరిస్థితిని పోలి ఉందని, పాలన లేని భూమిగా మారిందని ట్వీట్ చేశారు. 40 ఏళ్లుగా సైన్యంలో పనిచేసిన ఓ అధికారి స్పందన ఇది. మణిపూర్ పరిస్థితి పొరుగు రాష్ట్రాల్లోనూ ప్రతిబింబిస్తోంది. మణిపూర్‌లో మైనారిటీలపై వేధింపులను అంతం చేసేందుకు మిజోరాంకు చెందిన మెయితీలు జోక్యం చేసుకోవాలని మిజోరం విద్యార్థుల ప్రజావేదిక ఎంఎస్‌డిపి డిమాండ్ చేసింది. మిజోరాంలో మెయితీలు క్షేమంగా ఉండగా, మణిపూర్‌లో తమ సోదరులు పడుతున్న కష్టాలను చూడనట్లు నటించలేరని, మణిపూర్ సమస్యను సత్వరమే పరిష్కరించకుంటే భవిష్యత్తు దుర్భరంగా మారుతుందని ఎంఎస్‌డిపి ప్రకటించింది. ఈశాన్య రాష్ట్రాల్లో నెలకొన్న అశాంతి బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ల విద్వేష భావజాల ప్రభావమే.










