Jun 20,2022 08:03
  • కాగ్‌కు వివరాలివ్వని ఆర్థికశాఖ
  • జీతాల పద్దులో మార్పు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : చేసిన రుణాలు, పలు సంస్థలకు రుణాల కోసం ఇచ్చిన గ్యారెంటీల వివరాలను కాగ్‌కు రాష్ట్ర ఆర్థికశాఖ సమర్పించాల్సి ఉన్నప్పటికీ, 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంతవరకు ఆ వివరాలను సమర్పించలేదు. ఇదే విషయాన్ని కాగ్‌ తన వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. ఇదే సమయరలో జీతాలు, పింఛన్లకు సంబంధించి, సబ్సిడీల వివరాలు సమర్పించినప్పటికీ, వాటిలో అంతరాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.
      కాగ్‌ తన నివేదికలో గ్యారెంటీలపైనా స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం 2022 మార్చి 31 నాటికి పలు సంస్థలకు ఇచ్చిన గ్యారెంటీల వివరాలు, ఎప్పుడు ఇచ్చారు, ఎంత మొత్తానికి ఇచ్చారన్నది కాగ్‌కు ఆర్థికశాఖ వివరించాల్సి ఉంటుంది. అలాగే మార్చి 31 నాటికి తీసుకున్న రుణాలు, గత రుణాలకు చేసిన చెల్లింపులు, వడ్డీల వివరాలు, ఇంకా ఎంత అప్పు ఉందన్నది కూడా స్పష్టం చేయాల్సి ఉంటుంది. అయితే ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వివరాలు తమకు అందలేదని కాగ్‌ బయటపెట్టడం గమనార్హం. కీలకమైన జీతాలకు సంబంధించి రెవెన్యూ వ్యయం విభాగంలోనే చూపించాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రతినెలా రూ.3,500 కోట్లకు అటూ ఇటూగా వ్యయం ఉంటుంది. ఈసారి గణాంకాల్లో ఫిబ్రవరి నెలలో కేవలం రూ.417 కోట్లు మాత్రమే రెవెన్యూ వ్యయ పద్దులో చూపించిన ఆర్థికశాఖ, మరో రూ.1,256 కోట్లను పెట్టుబడి వ్యయ విభాగంలో చూపించింది. రెండూ కలిపినా రూ.1,700 కోట్ల వరకు మాత్రమే కనిపిస్తోంది. మిగిలిన దాదాపు రూ.2 వేలకోట్ల జీతాల వ్యయం ఏమైందన్నది లెక్కల్లో తేలకపోవడం గమనార్హం. మొత్తమ్మీద చూస్తే జీతాలకు రెవెన్యూ వ్యయ పద్దులో రూ.40,896 కోట్లు, పెట్టుబడి వ్యయం పద్దులో రూ.16,194 కోట్లు కలిపి రూ.57,090 కోట్లు ఖర్చు జరిగినట్లు చూపించారు. జీతాల వ్యయాన్ని పెట్టుబడి వ్యయంగా చూపించరాదని గతంలోనే కాగ్‌ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయాన్ని కొంతమంది ఆర్థికశాఖ అధికారులు ప్రస్తావించడం విశేషం.
 

                                                            సబ్సిడీలపైనా అస్పష్టత

సబ్సిడీలకు సంబంధించి కూడా కొరత అస్పష్టత నెలకొన్నట్లు కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు రూ.17,234 కోట్లు ఖర్చు చేసినట్లు చూపించగా, మార్చి వచ్చేసరికి ఈ మొత్తం రూ.14,681 కోట్లకు తగ్గిపోయింది.