Sep 23,2023 11:01

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో : దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో ఎంఎస్‌ఎంఇలదే కీలకపాత్ర అని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ మెర్సీ ఎపాఓ వెల్లడించారు. విశాఖలోని దసపల్లా హోటల్‌లో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండిస్టీ (ఫ్యాప్సీ) ఆధ్వర్యంలో షిప్పింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌పై అంతర్జాతీయ సదస్సు శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఇలకు బ్యాంకర్ల రుణ మద్దతు లభిస్తే జిడిపిపై ఆ ప్రభావం ఉంటుందన్నారు. ఎగుమతులు, దిగుమతుల పరిమాణం పెరిగి ఉపాధి చేకూరుతుందని తెలిపారు. ఎంఎస్‌ఎంఇ ఔత్సాహికులకు బ్యాంకుల రుణాలు, సాంకేతిక సహకారం, మౌలిక వసతులు, నైపుణ్య శిక్షణ, మార్కెట్‌ సహకారం లభిస్తే ఆర్థిక వ్యవస్థపై మంచి ప్రభావం ఉంటుందని వెల్లడించారు. జిడిపి వృద్ధి చెందుతుందని తెలిపారు. నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ కంటైనర్‌ ఫ్రైట్‌ స్టేషన్‌ ఉపాధ్యక్షులు, శ్రావణ్‌ షిప్పింగ్‌ సర్వీసెస్‌ ఎమ్‌డి జి.సాంబశివరావు మాట్లాడుతూ విశాఖ వంటి చోట్ల అద్భుతమైన అభివృద్ధికి అవకాశాలున్నాయన్నారు.
          రోడ్డు, రైల్వే, ఎయిర్‌వే కనెక్టివిటీ, ఇతర సామర్థ్యాలను ఆధునీకరించుకుని వ్యయ ప్రభావాలను తగ్గించుకునే మౌలిక వసతులకు ప్రాధాన్యమివ్వాలన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో భాగంగా కస్టమ్స్‌ ప్రొసీజర్స్‌ డిజిటల్‌ డాక్యుమెంటేషన్‌ పెంచాల్సి ఉందని పేర్కొన్నారు. ఫ్యాప్సీ అధ్యక్షులు కరేణేంద్ర ఎస్‌ జాస్తి మాట్లాడుతూ ఎపి తీర ప్రాంతం వ్యూహాత్మక వ్యాపారానికి కీలకంగా ఉందన్నారు. ఎగుమతుల వ్యాపారానికి లాజిస్టిక్స్‌ అత్యంత ముఖ్యమని తెలిపారు. 2023 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సరుకుల ఎగుమతులు 19.32 బిలియన్‌ డాలర్లకు చేరుకోవడంలో సముద్ర ఉత్పత్తుల వ్యాపారం తోడ్పడిందన్నారు. ఉపాధ్యక్షులు కంకటాల మల్లికార్జునరావు మాట్లాడుతూ షిప్పింగ్‌, లాజిస్టిక్స్‌ రంగాన్ని మరింత ఉన్నత స్థాయికి చేర్చేందుకు వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించాల్సి ఉందని పేర్కొన్నారు. ఎపి మారిటైం బోర్డు డిప్యూటీ సిఇఒ లెఫ్టినెంట్‌ బిఎం రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. పరిశ్రమలకు, వ్యాపారులకు తమ సహకారం ఉంటుందన్నారు. సదస్సులో జెఎస్‌డబ్ల్యు ఇండిస్టియల్‌ పార్క్‌ లిమిటెడ్‌ సిఇఒ ఆర్‌.కనకారావు పాల్గొన్నారు.