Sep 12,2022 11:03
  • ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డలు
  • గిరిజన గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

ప్రజాశక్తి - యంత్రాంగం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు జిల్లాల్లో పంట పొలాలు నీటమునిగాయి. ఊదురుగాలులకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. పలు గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆదివారం విశాఖపట్నంలో కురిసిన వర్షానికి భీమిలి వ్యవసాయ డివిజన్‌ పరిధిలో 157 ఎకరాల వరి పంట నీట మునిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం గడుతూరు పంచాయతీ రాళ్లపుట్టు గ్రామంలో ఓ ఇల్లు కూలిపోయింది. అరకులోయ మండలం జయంతివలస గ్రామ సమీపాన గెడ్డ పొంగి ప్రవహించడంతో సుమారు పది గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని సోకిలేరు పొంగి ప్రవహించడంతో చింతూరు - విఆర్‌.పురం మండలాలకు రాకపోకలు ఆగిపోయాయి. శబరి నదిలో వరద ప్రవాహం క్రమేపీ పెరుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో చెదురుమదురు వర్షాలు పడ్డాయి. గొట్టాబ్యారేజీ వద్ద వంశధార నదిలో 25 వేల క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. బాహుదా నదిలో 36 వేలు, నాగావళిలో 27,100 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుంది. విజయనగరం, నెల్లూరులో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి.
 

                                                                24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ దక్షిణ ఛత్తీష్‌గఢ్‌ మీదుగా ప్రయాణించి క్రమంగా బలహీనపడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
 

                                                                      ప్రకాశం బ్యారేజీకి తగ్గిన వరద

ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌ జలాశయానికి 1.90 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా 1.45 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతలకు 1.80 లక్షల క్యూసెక్కులు వస్తుండగా 1.67 లక్షల క్యూసెక్కులను దిగువ ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తున్నారు. మూడు లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండటంతో ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను ఎత్తి తూర్పు, పశ్చిమ డెల్టాకు 15 వేల క్యూసెక్కులు, 2.85 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు.