May 16,2023 16:02

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (అన్నమయ్యజిల్లా) : పట్టణంలో ఉన్న కార్పొరేట్‌, ప్రైవేట్‌ విద్యాసంస్థల అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని, ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ సర్వేపల్లి, జిల్లా ఉపాధ్యక్షులు రమణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం సబ్‌ కలెక్టర్‌ ఫర్మన్‌ అహ్మద్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజంపేట పట్టణంలో కార్పొరేట్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లో ప్రభుత్వానికి విరుద్ధంగా అడ్మిషన్లు జరుపుతున్నారని.. టెక్నో, ఈ టెక్నో, ఒలంపియాడ్‌ అని అనేక రకరకాల పేర్లు పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ పాఠ్యపుస్తకాలు, షుస్‌ అని అనేక రకాలుగా దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అడ్మిషన్ల పేరుతో ప్రైవేట్‌, కార్పొరేట్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను యాజమాన్యాలు వేధిస్తున్నాయని.. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న పాఠశాలలపై తక్షణమే చటపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజంపేటలో వున్న శ్రీ సాయి విద్యాలయం పాఠశాల ఆగడాలు మితిమీరి పోయాయన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉంటూ ప్రైవేట్‌ పాఠశాలలు నిర్వహిస్తూ విద్యను వ్యాపార సరుకుగా చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులపైన చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులకు పలు దఫాలుగా తెలియజేసినా ఇంత వరకు చర్యలు తీసుకోవడంలో పూర్తి వైఫల్యం చెందారని విమర్శించారు. ఇప్పటి కైనా చర్యలు తీసుకోవాలని.. లేని పక్షంలో పాఠశాలల ఎదుట ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాజంపేట పట్టణ నాయకులు అఖిల్‌, శుబన్‌, సాయి, కార్తీక్‌, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.