Aug 28,2022 09:34

అనగనగా వినోదపురం అనే గ్రామానికి దగ్గర్లో ఓ అడవి ఉంది.. అడవిలోని చెరువు దగ్గర చెట్టు కింద చీమల పుట్ట ఉంది. ఆ పుట్టలో చాలా చీమలు ఉండేవి.. ఆ పక్కనే ఉన్న చెరువులో బాతులు, ఇతర జంతువులూ ఈత కొడుతూ హాయిగా ఆడుకుంటూ కాలక్షేపం చేస్తుండేవి.. అయితే పుట్టలోని చీమలు మాత్రం ప్రతిరోజూ ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి పడుకునే వరకూ ఆహారాన్ని పోగు చేస్తూ ఉండేవి. అడవికి పరిసర ప్రాంతాల్లో ఉండే పొలాల్లో దొరికే ధాన్యాన్ని, గ్రామాల్లోని దుకాణాల వద్ద వృథాగా పడేసిన ఆహారాన్ని ఎంతో శ్రమతో వరుస కట్టి మరీ సమిష్టిగా పుట్టలోకి పోగేసేవి. మిగతా జీవులైన బాతులు, ఇతర నేస్తాలు హాయిగా, సంతోషంగా ఆడుతూ.. పాడుతూ.. కాలం గడుపుతూ ఉండేవి.
   అయితే రోజుల తరబడి ఆ చీమలు అలా క్రమశిక్షణగా వెళ్తూ ఉండటం చూసి అక్కడే ఆడుకుంటూ ఉన్న ఒక పొట్టి బాతు, చీమలను ఎగతాళి చేసేది. 'ఎందుకు మీరు ఆడుకోకుండా ఎప్పుడూ అలా ఆహారాన్ని మోస్తూ ఉంటారు?' అని చీమలు నవ్వి.. 'ఇప్పుడు కష్టపడితేనే.. తర్వాత కష్టకాలంలో హాయిగా జీవించగలం.. అలాకాకుండా ఈరోజు కడుపు నిండింది కదా అని.. కాలక్షేపం చేస్తే మున్ముందు ఇబ్బంది పడతాం..' అని చెప్పింది.
    దానికి పొట్టి బాతు.. 'ఇదంతా మీ పిచ్చి. సరేలే నాకెందుకు మీ బాధ మీరు పడండి' అని నవ్వేసి, ఆడుకోడానికి వెళ్లింది. అలా చాలారోజుల పాటు పొట్టిబాతు చెరువు పక్కనే ఉన్న పచ్చిక భూముల్లో ఎగిరే పురుగులు, కీటకాలు.. గడ్డిలో పెరిగే చదల పురుగులను తింటూ అటూ, ఇటూ తిరుగుతూ ఆడుకుంటూ ఉండేది. అది పొట్టిగా వున్నందున నీళ్లలోకి దిగాలంటే ముగినిపోతానేమోనని దానికి భయం. అందుకే చెరువు పక్కన ఉండే చిన్న చిన్న గుంటల్లో మాత్రమే తిరుగుతుండేది.
ఒకసారి బాగా వర్షాలు వచ్చినప్పుడు బాతుల యజమాని అన్ని బాతులతో పాటు పొట్టి బాతును కూడా పట్టుకొని, బుట్ట కింద మూసి పెట్టాడు. యజమాని పేదవాడు కావడంతో వర్షాకాలంలో వాటికి సరిగ్గా ఆహారాన్ని పెట్టలేకపోయాడు.
     దీంతో పొట్టిబాతుకు బాగా ఆకలి వేసింది. అప్పుడు ఆ బాతు 'అయ్యో, ఈ వర్షంలో పురుగులు పట్టుకొని తినలేము. యజమాని దగ్గర నిండుగా దాణా వేసే శక్తి లేదు అని అనుకుంది. చీమలు ఎంత మంచిపని చేస్తున్నాయి! ఎవరి మీదా ఆధారపడకుండా వాటి ఆహారాన్ని అవే సంపాదించుకుని, ముందుచూపుతో దాచిపెట్టుకుంటు న్నాయి. వర్షాకాలంలో పుట్టలో కూర్చొని. హాయిగా తింటున్నాయి. మా బాతులకేమో ఆహారం తక్కువ పెట్టడం వల్ల ఆకలేస్తోంది. చూడటానికి చిన్నగా ఉన్నా చీమలు ఎంతో తెలివైనవి, శ్రమించేతత్వం కలిగినవి' అనుకుంది.
     'ఈ సారి ఎండా కాలంలో మా బాతులమంతా కూడా మెడకు జోలె కట్టుకొని, ముక్కుతో గింజలను తీసుకుని, జోలెలో వేసుకొని తెచ్చి, యజమాని ఇంటి కొట్టంలో ఒక మూల దాచిపెట్టాలి. అప్పుడు మా బాతులకు కూడా కడుపునిండా ఆహారం ఉంటుంది' అనుకుంటూ.. తన కొత్త ఆలోచనను తన బాతు మిత్రులకు చెప్పింది. అది విని అన్ని బాతులూ సంతోషంగా అలాగే చేద్దామని నిర్ణయించుకున్నాయి.
 

శైలజ కరణం
94402 68953