చైనా, రష్యా నేతల ప్రకటన
సమర్కండ్ : ప్రపంచ అగ్ర దేశాలుగా కీలకమైన విషయాల్లో కలిసి పనిచేయడానికి చైనా, రష్యా నేతలు సుముఖత వ్యక్తం చేశారు. కీలక ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో పరస్పరం మద్దతిచ్చుకోవడానికి, సహకరించుకోవడానికి కూడా ఇరువురు అంగీకరించారు. షాంఘై సహకార సంస్థ 22వ సదస్సు సందర్భంగా గురువారం చైనా, రష్యా అధ్యక్షులు జీ జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్‌లు ఇక్కడ భేటీ అయ్యారు. కీలక ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో సమన్వయంతో వ్యవహరిస్తూ, పరస్పర మద్దతుతో, సహకారంతో ముందుకు సాగాలని ఇరువురు నేతలు భావించారు.
రష్యాతో కలిసి పని చేయడానికి సిద్ధంగా వున్నట్లు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చెప్పారు. వాణిజ్యం, వ్యవసాయం, అనుసంథానత వంటి రంగాల్లో ఆచరణత్మాక సహకరాన్ని మరింత పెంపొందించేందుకు కూడా చైనా సుముఖంగా వుందన్నారు. షాంఘై సహకార సంస్థ పరిధిలో, ఆసియాలో విశ్వాస పునరుద్ధరణ చర్యలపై సమావేశంలో, బ్రిక్స్‌లో, ఇతర బహుళపక్ష వేదికలపై సంఘీభావాన్ని పెంచుకునేందుకు, సంబంధిత పక్షాల మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంచేందుకు ఇరు పక్షాలు సమన్వయాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని జిన్‌పింగ్ పిలుపిచ్చారు. చైనా, రష్యాలు ఆచరణాత్మక సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని, వర్ధమాన దేశాల్లో, కొత్తగా ఆవిర్భవిస్తున్న మార్కెట్లలో ఉమ్మడి ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు ప్రాంతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడుకునేందుకు కృషి చేయాలని కోరారు.
సంతులన వైఖరి పాటించినందుకు సంతోషం : పుతిన్
ఉక్రెయిన్ విషయంలో సంతులన వైఖరి తీసుకున్నందుకు చైనా అధినేత జిన్‌పింగ్‌ను పుతిన్ ప్రశంసించారు. తైవాన్ విషయంలో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నందుకు అమెరికాను తీవ్రంగా విమర్శించారు. ఉక్రెయిన్‌పై సైనికచర్య ప్రారంభమైన తర్వాత ఇరువురు నేతలు ముఖాముఖి కలుసుకోవడం ఇదే ప్రధమం. ఉక్రెయిన్ విషయంలో చైనా సమతూకంతో వ్యవహరిస్తున్నా, ఈ ఘర్షణకు సంబంధించి చైనాకు కొన్ని ప్రశ్నలు, ఆందోళనలు వున్నాయని తనకు అర్ధమవుతోందని పుతిన్ అన్నారు. ఈ సమావేశంలో రష్యా వైఖరి గురించి సమగ్రంగా తెలియచేయాలని భావిస్తున్నట్లు పుతిన్ చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా ప్రత్యేక సైనిక చర్యను ఖండించకుండా చైనా సంయమనం పాటించింది. రష్యా వైఖరికి అనుగుణంగా ఆ సైనిక చర్యను దాడి లేదా యుద్ధం అని కూడా వ్యాఖ్యానించడం లేదు. అలాగే తైవాన్ విషయంలో చైనాను పుతిన్ పూర్తిగా సమర్ధించారు. ఒకే చైనా అన్న సూత్రానికి రష్యా పూర్తిగా కట్టుబడి వుందని స్పష్టం చేశారు.










