Sep 25,2023 20:19

ప్రజాశకి-అమరావతి బ్యూరో : అసైన్డ్‌ భూములపై సర్వహక్కులు కల్పించడమంటే.. అమ్ముకోడానికే హక్కు కల్పించినట్లు కాదని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. లబ్ధిదారులు మెరుగైన జీవన పరిస్థితులలోకి వెళ్లేందుకు భూములను ఉపయోగించుకోవాలనే లక్ష్యంతో అసైన్డ్‌ చట్టసవరణను చేపట్టామని తెలిపారు. శాసనసభలో సోమవారం జరిగిన స్వల్పకాలిక చర్చలో అసైన్డ్‌ చట్టసవరణపై మంత్రి ధర్మాన మాట్లాడారు. పేదల చేతుల్లోనుంచి బలవంతంగా అసైన్డ్‌ భూములు లాక్కోకూడదనే అప్పట్లో అసైన్డ్‌చట్టాన్ని పకడ్బందీగా రూపొందించారని తెలిపారు. గ్రామాల్లో దౌర్జన్యంగా భూములు లాక్కునే పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. రైతుల వద్ద వున్న ఈ భూములను కొనరాదు, అమ్మరాదు, మార్పిడి చేయరాదు అనే నిబంధనలతో ఆ భూమికి విలువలేకుండా పోయిందని తెలిపారు. అందుకే జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అధ్యయనం చేశాక 20 ఏళ్ల తర్వాత అసైన్డ్‌దారులకు సర్వహక్కులు కల్పించేలా అసైన్డ్‌ చట్టసవరణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ చట్టసవరణతో రాష్ట్రంలో 28లక్షల ఎకరాలకు సర్వహక్కులను రైతులు పొందనున్నారని తెలిపారు. తాత, తండ్రి పేరిట వున్న ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లస్థలాలు కూడా విలువలేకుండా వున్నాయని వాటికి మార్కెట్‌లో విలువ పెరిగేలా పదేళ్లకు రెగ్యులర్‌ చేస్తున్నామని తెలిపారు.