ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ది, విశాఖపట్నానికు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోసం ఉద్యమించేందుకు తనకు మంత్రి పదవి అడ్డంగా ఉండకూడదనే ఉద్దేశంతో రాజీనామా చేయాలనుకుంటున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సిఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సిఎంను కలిసి ఆయన తన అభిప్రాయాన్ని వివరించారని సమాచారం. తాను 40 ఏళ్లపాటు ప్రజాజీవితంలో ఉన్నానని గ్రామసర్పంచ్ నుండి కీలకమైన క్యాబినెట్ మంత్రిగా పనిచేశానని ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్దికి విశాఖలో పరిపాలనా రాజధాని ఆక్కటే పరిష్కారం అని భావన ప్రజల్లో నాటుకు పోయిందని ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిసింది. అమరావతిలో లక్ష కోట్లు ఖర్చు చేసేకంటే మూడు ప్రాంతాల సమంగా అభివృద్ది చెందాలంటే పోరాటం అవసరమని వివరించినట్లు తెలిసింది.










