Sep 14,2023 20:26

ప్రజాశక్తి-చిలమత్తూరు (సత్యసాయి జిల్లా) :శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కోడూరులో పేదలు భూ స్వాధీన పోరాటం నిర్వహించారు. సర్వే నంబర్‌ 805లో ఎర్రజెండాలు పాతి, గుడిసెలు వేసుకుని ఆందోళన నిర్వహించారు. సిపిఎం ఆధ్వర్యంలో గురువారం ఈ కార్యక్రమం నిర్వహించారు. వీరికి వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ పోరాటంలో పాల్గోన్న సిపిఎం రాష్ట్ర నాయకులు జి.ఓబులు మాట్లాడుతూ.. చిలమత్తూరు మండల పరిధిలో దాదాపు 250 మందికి మూడేళ్ల క్రితం కోడూరు వద్ద ముద్దప్పల్లి సమీపంలో ప్రభుత్వం ఇళ్ల స్థలాలను కేటాయించిందని, తర్వాత లాలేపల్లి క్రాస్‌ వద్ద 805 సర్వే నంబర్‌లో స్థలాలు ఇస్తామని చెప్పారన్నారు. ఈ స్థలాలు అన్నీ విలువైనవన్న భావనతో ప్రతిసారీ వాటిని రద్దు చేయడం, కొత్తవాటిని ఇస్తామని చెప్పడం పరిపాటిగా మారిందని విమర్శించారు. పేదలకు విలువైన ప్రదేశంలో ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని ఏ చట్టంలో రాశారో చెప్పాలని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని హెచ్చరించారు. ఆందోళన నిర్వహిస్తున్న ప్రాంతానికి తహశీల్దార్‌ నాగరాజు, ఎస్‌ఐ శ్రీనివాసులు తన సిబ్బందితో చేరుకున్నారు. పేదలు, సిపిఎం నాయకులతో మాట్లాడారు. కోర్టుల పేరుతో ఎంత కాలం తమను మోసం చేస్తారంటూ పేదలు నిలదీయడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. గురువారం రాత్రి వరకు దాదాపు 250 కుటుంబాలు చిన్నారులతో పాటు గుడిసెల్లోనే ఉన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఫిరంగి ప్రవీణ్‌ కుమార్‌, వెంకటేష్‌, నల్ల లక్ష్మినారాయణ, పేదలు పాల్గొన్నారు.