- రూ.95 కోట్లు లేక పక్కనబెట్టిన ప్రభుత్వం
- పాడేరులో బావి పూడికతీతకూ నిధుల కటకట
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఒకవైపు వేసవి తీవ్రత పెరుగుతోంది. పలుచోట్ల రెండు రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నా రు. ఏప్రిల్ 15 నాటికే ఉష్ణోగ్రత 44 డిగ్రీలకు చేరుకుంది. మే నెలలో తీవ్రత మరింత పెరిగి పలు జిల్లాల్లో నీటి వనరులు పూర్తిగా ఎండిపోయే ప్రమాదముంది. వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులు అంచనాలు రూపొందిం చారు. నీటి సరఫరాకు, బోర్లు బాగుచేసేందుకు, పశువుల నీటి సరఫరాకు సుమారు రూ.95 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మార్చిలోనే దీన్ని ప్రభుత్వానికి పంపించినా ఇంతవరకు అమలుకు నోచలేదు. నిధులు ఇస్తున్నామా లేదా అనేది స్పష్టత ఇవ్వలేదు. రాష్ట్రంలో ఈ ఏడాది 26 జిల్లాల ప్రాతిపదికన ప్లాను రూపొందించారు. వీటిల్లో 16 జిల్లాల్లో సమస్య తీవ్రంగా ఉంటుందని అంచనా వేశారు. వేసవిలో 3,720 నివాస ప్రాంతాలకు (హ్యాబిటేషన్స్) ట్యాంకుల ద్వారా నీటి సరఫరాకు రూ.82.36 కోట్లు అవసరం ఉంటుందని లెక్కగ ట్టారు. 521 గ్రామాల్లో మనుషులతోపాటు ఆవులూ, గేదెలకూ నీటిని అందించాలని ప్రతిపాదించారు. దీనికోసం రూ.3.10 కోట్లు ఖర్చవుతుందని తేల్చారు. అవసరమైన నీటిని ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి బోర్లు, బావుల నుండి కొనుగోలు చేసేందుకు రూ.5 కోట్లు అవసరమని తెలిపారు. పాడైపోయిన 1,061 బోర్లు బాగుచేసేందుకు రూ.1.91 కోట్లు, 718 బోర్లు లోతు పెంచేందుకు రూ.5.25 కోట్లు అవసరం ఉంటుందని తేల్చారు. ముఖ్యంగా పాడేరు ప్రాంతంలో బావి పూడికతీతకు రూ.2 కోట్ల వరకూ ఖర్చవుతుందని అంచనాలు రూపొందించినా దానికి సంబంధించి ఒక్క అడుగూ ముందుకు వేయడం లేదు. వేసవిలో చెరువులపై ఆధారపడ్డ 193 గ్రామాల్లో చెరువులను నింపేందుకు రూ.2.24 కోట్లు అవసరముంటుందని ప్రతిపాదించినా నిధులు లేకపోవడం వల్లే యాక్షన్ ప్లానుకు ఆమోదం పొందలేకపోయిందని చెబుతున్నారు. దీనిపై అధికారులను వివరణ అడిగితే తమకేమీ తెలియదని సమాధానం ఇచ్చారు.
పాత బకాయి రూ.230 కోట్లు
వేసవిలో బోర్ల ద్వారా నీటిని ఇచ్చినందుకు గానూ గత మూడేళ్లలో రూ.230 కోట్ల బకాయిలు ఉన్నాయి. వాటిని ప్రభుత్వం ఇంతవరకు విడుదల చేయలేదు. పాత బకాయిలు ఇవ్వకపోతే పనులు ఎలా చేస్తామని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు.










