Sep 20,2023 22:02

ప్రజాశక్తి- నందవరం (కర్నూలు జిల్లా) : కర్నూలు జిల్లా నందవరం మండలం కనకవీడు గ్రామానికి చెందిన దళిత రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు, మృతుని కుటుంబసభ్యుల కథనం ప్రకారం... కనకవీడు గ్రామానికి చెందిన ఎ.లింగన్న (54) తన 1.50 ఎకరాల పొలంలో గత మూడు సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు. పెట్టుబడి కోసం బ్యాంకు, బంధువులు వద్ద దాదాపు రూ.5.25 లక్షలు అప్పు చేశారు. పంటలు సరిగా పండక నష్టపోయారు. పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాకపోవడం, అప్పు తీర్చే మార్గం కనిపించకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆత్మహత్య చేసుకోవడానికి మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో పురుగుల మందు తాగారు. నోటి నుంచి నురగలు వస్తూ అపస్మారకస్థితిలో పడి ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు గమనించి ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయినా, ఫలితం లేకపోయింది. బుధవారం తెల్లవారుజామున ఆయన మృతి చెందారు. లింగన్న భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.