తెలుగు సినీ పరిశ్రమలో ముందుకు వెళ్లాలంటే ఒకటికి రెండు సార్లు ఆచితూచి అడుగులేస్తారు. తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తారు. అయితే అందుకోసం ఏ పాత్రలు పడితే ఆ పాత్రలు చేయడానికి ఇష్టపడరు. అయితే కొందరు యువ కథా నాయికలు మాత్రం నటనకు ఆస్కారం ఉండే ఏ పాత్రలనైనా ఛాలెంజింగ్‌గా తీసుకుంటున్నారు. అలాంటి వారిలో నటి రెజీనా ఒకరు. ఓ వైపు వెబ్‌సిరీస్‌లు, మరోవైపు సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్న రెజీనా తాజాగా నివేదా థామస్‌తో కలిసి 'శాకిని డాకిని' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె గురించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. ఆ విశేషాలు..
శివ మనసులో శృతి (ఎస్‌ఎంఎస్) చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు కోలీవుడ్ నటి రెజీనా కసాండ్రా. తొలుత కోలీవుడ్‌లో నట ప్రయాణాన్ని ప్రారంభించినా.. ఆ తరువాత టాలీవుడ్ తదితర దక్షిణాది భాషల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2005లో కండనాళ్ మొదల్ తమిళ చిత్రంతో కథానాయికగా పరిచయమయ్యారు. ఆ చిత్రం విజయంతో మరికొన్ని చిత్రాల్లో అవకాశాలను రాబట్టుకున్నారు. ఆ తర్వాత తెలుగులో 'కొత్త జంట, పవర్, పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' వంటి హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా 'అన్యాస్ ట్యుటోరియల్' అనే వెబ్ సిరీస్‌లోనూ నటించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి 'ఆచార్య'లో స్పెషల్ సాంగ్‌లో కూడా మెరిశారు. 'షూర్‌వీర్, ఫర్జీ' వెబ్ సిరీస్‌లతోనూ ఆకట్టుకున్నారు.
అయితే 'నేను సినిమాలో నటించే తొలినాళ్లలో చాలా తక్కువ పారితోషికం ఇచ్చేవారు. అయినా కూడా కష్టపడి పనిచేసేదాన్ని' అని రెజీనా చెప్పుకొచ్చారు. ''ఎస్‌ఎంఎస్' తో తెలుగులోకి కథానాయికగా అడుగుపెట్టా. అప్పట్లో నా షెడ్యూల్ అమ్మే చూసుకునేది. పాత్రల విషయంలో కొన్నిసార్లు అమ్మతో వాదించినా, షూటింగ్‌కు మాత్రం ఇబ్బంది పెట్టకుండా వెళ్లేదాన్ని' అన్నారు.
అప్పుడే తెలిసింది అసలు విషయం!
'ఎందుకో నాకు అప్పట్లో పారితోషికం తక్కువ ఇచ్చేవారు. ఓ ఇంటర్వ్యూకు వెళ్లి వచ్చిన తర్వాత విషయం అర్థమైంది. ఆ సమయంలో నాకు వ్యక్తిగత మేకప్, హెయిర్ స్టైలిస్ట్ ఉండేవారు కాదు. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ రోజు రేడియో ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్లా. ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత ఫొటోలు తీసుకుంటామన్నారు. నేనూ సరేనన్నా. ఆ ఫొటోలు వెబ్‌సైట్స్‌లో వచ్చిన తర్వాత కానీ, నాకు అసలు విషయం అర్థమైంది. అస్సలు నేను హీరోయిన్‌లానే లేను. ఆ ఫొటోలు ఇప్పటికీ ఇంటర్నెట్‌లో ఉన్నాయి. అప్పుడు అర్థమైంది. మేకప్, హెయిర్‌స్టైలిస్ట్ లేకుండా ఏ ప్రమోషన్స్‌కు వెళ్లకూడదు' అని చెప్పారు.
'ఇక నేను స్కూల్ లీడర్‌గా ఉన్నప్పుడే యాంకరింగ్ చేశా. అప్పుడు అన్నీ చేయాల్సి వచ్చింది. స్కూల్ డేస్‌లో రోశాణ్ విశాల్ అనే అబ్బాయిని కొట్టేశా.. చాలా మంది నా గురించి డామినేటింగ్ అని చెప్తారు. నా ఫిజిక్ చూసి వాళ్లందరూ డామినేటింగ్ అని అంటున్నారేమో. హర్రర్ సినిమాలంటే చాలా ఇష్టం..' అంటూ చెప్పుకొచ్చారు రెజీనా.
ఆ పాత్ర వారికి ధైర్యాన్నిచ్చింది..
'బాలీవుడ్‌కు వెళ్లే వాళ్లు మంచి పాత్రతో ఎంట్రీ ఇవ్వాలనుకుంటారు. 'ఏక్ లడిఖీ కో దేఖాతో ఐసా లగా'లో లెస్బియన్ రోల్ చేశా. ఆ పాత్ర చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒకరోజు దర్శకురాలు షెల్లీ కాల్ చేసి కథ, పాత్రను వివరించారు. 15-20 నిమిషాలు మాత్రమే ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత షెల్లీ చెన్నరు వచ్చి, మొదటి సన్నివేశం డైలాగ్ నుంచి
చివరి సీన్ డైలాగ్ వరకూ పూర్తి స్క్రిప్ట్ చెప్పారు. దీంతో ఆ నిర్ణయం తీసుకున్నా. నా కెరీర్‌లో ఆ తరహా పాత్ర ఎప్పుడూ చేయలేదు. అయితే ఈ పాత్ర వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో తెలియదు. కానీ, అన్ని చిత్రాల్లానే ఇదొకటి అనుకుని చేశా. కానీ, ఎంత బరువైన పాత్ర చేశానో అప్పుడు తెలియదు. ఏదో వెళ్లాను కొన్ని సీన్లు చేశాను. సినిమా విడుదలైంది.. ఆ తర్వాత తెలిసింది' అని చెప్పారు.
హిట్ ఫ్యాక్టర్ ఎప్పుడూ పనిచేయలేదు..
'నా నటనకు మంచి ప్రశంసలే వచ్చాయి. కొందరు యువతుల నుంచి లెటర్స్ వచ్చాయి. తమ తల్లిదండ్రుల దగ్గర మనసు విప్పి మాట్లాడటానికి నా పాత్ర ఎంతగానో ఉపయోగపడిందని చెప్పారు. 'నిజమేనా?' అని అనిపించింది. ఒక బాలిక అయితే, నా పాత్రతో పెద్ద పుస్తకమే రాసింది. ఇందులో లెస్బియన్ కమ్యూనిటీ ఎదుర్కొంటున్న పరిస్థితులను చెప్పే ప్రయత్నం చేశాం. ఇక సినిమా మిశ్రమ స్పందన వచ్చింది. తప్పుడు నిర్ణయం తీసుకున్నానని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. బాధపడలేదు. ఇప్పటికీ ఆ పాత్ర చేసినందుకు సంతోషంగానే ఉన్నా. ప్రస్తుతం సోషల్‌మీడియా యుగంలో ఉన్నాం. నేనెప్పుడూ వ్యూహాత్మకంగా పనిచేయలేదు. నా కెరీర్‌లో హిట్ ఫ్యాక్టర్ ఎప్పుడూ పనిచేయలేదు. కష్టపడి పనిచేయడమే నాకు తెలుసు' అని రెజీనా చెప్పుకొచ్చారు.
పేరు : రెజీనా కసాండ్రా
పుట్టిన తేదీ : డిసెంబర్ 13, 1990
పుట్టిన ప్రాంతం : చెన్నరు
చదువు : సైకాలజీలో డిగ్రీ
హాబీస్ : రీడింగ్
ఇష్టమైన నటులు : సమంత, అజిత్ కుమార్