Feb 26,2023 12:27

వెల్లింగ్టన్‌: తొలి ఇన్నింగ్స్‌లో 435/5 వద్ద ఇంగ్లాండ్‌ డిక్లేర్డ్‌ చేసింది. అనంతరం అండర్సన్‌ (3/47), స్టువర్ట్‌ బ్రాడ్‌ (4/61), జాక్‌ లిచ్‌ (3/80) ధాటికి కివీస్‌ 209 పరుగులకే ఆలౌటైంది. దీంతో న్యూజిలాండ్‌ని ఇంగ్లాండ్‌ ఫాలోఆన్‌ ఆడిస్తోంది. కాగా ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ టీమ్‌ సౌథీ ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 49 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్స్‌లు బాది 73 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో భారత మాజీ కెప్టెన్‌ ధోనీ 78 సిక్స్‌ల రికార్డును అధిగమించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన వారిలో ప్రస్తుతం టిమ్‌ సౌథీ 82 సిక్స్‌లతో 11వ స్థానంలో ఉన్నాడు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ (69)తోపాటు టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (68), కపిల్‌ దేవ్‌ (61)ను కూడా దాటేశాడు. ఇదే మ్యాచ్‌లో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్‌ పడగొట్టిన సౌథీ.. అన్ని ఫార్మాట్లలో కలిపి 700 వికెట్లు కూల్చిన తొలి న్యూజిలాండ్‌ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. డానియల్‌ వెటోరి 696 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆల్‌టైమ్‌ రికార్డులపరంగా చూస్తే సౌథీ 15వ స్థానంలో నిలిచాడు. శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ (1,347) వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.