Jun 02,2023 08:34
  • మొన్న ములకులపెంట... నేడు అయ్యగార్లపల్లి !
  • ఎనిమిది మంది మృత్యువాత

ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి : అనంతపురం జిల్లాను మూత్రపిండాల వ్యాధి చుట్టేస్తోంది. గుంతకల్లు మండలం ములకులపెంట గ్రామంలో కిడ్నీ వ్యాధితో ఇప్పటికే పలువురు బాధపడుతున్నారు. పలువురు మృతి చెందారు. ఇప్పుడు శెట్టూరు మండలం అయ్యగార్లపల్లిలోనూ కిడ్నీ బాధితులు, మరణాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో, ఈ రెండు గ్రామాలూ శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతాన్ని తలపిస్తున్నాయి. అయ్యగార్లపల్లి గ్రామం రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉంది. శెట్టూరు మండల కేంద్రానికి ఆనుకుని ఉన్న ఈ గ్రామంలో మూడు వేల వరకు జనాభా ఉంది. కర్ణాటక సరిహద్దులో ఉన్న ఈ గ్రామం పూర్తిగా వ్యవసాయాధిరితమైంది. ఈ గ్రామాన్ని కిడ్నీ వ్యాధి చుట్టుముడుతోంది. వరుసగా ఒకరి తరువాత ఒకరు ఈ వ్యాధి బారినపడుతున్నారు. నెలల వ్యవధిలోనే మృతి చెందుతున్నారు. గత రెండేళ్లలో ఎనిమిది మంది కిడ్నీ వ్యాధితో మృత్యువాతపడ్డారు. వారిలో పెద్దింటి తిప్పేస్వామి, పూజారి రామన్న, కమ్మ ప్రకాష్‌, హనుమంతు, వడ్డే అంజయ్య, వీరభద్రప్ప, మల్లికార్జున, బోయ రామన్న ఉన్నారు. అంజయ్యకు ఇద్దరు పిల్లలు. వారిలో ఒకరు తిరుపతి ఐఐటిలో బిటెక్‌, మరొకరు తాడిపత్రిలో బిటెక్‌ చదువుతున్నాడు. అంజయ్య వైద్యం కోసం అయిన ఖర్చుతో ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి చితికిపోయింది. దీంతో, ఆయన ఇద్దరి పిల్లల చదువుకు వారు చదివిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కొందరు ఆర్థిక సహకారం అందించారు. ఈ గ్రామానికి చెందిన ముగ్గురు ప్రస్తుతం తీవ్రమైన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. వారిలో వీరేష్‌, ఈరన్న, గంగాధర్‌ ఉన్నారు. వీరేష్‌ అనంతపురం నగరంలోని కిమ్స్‌ సవేరా ఆస్పత్రిలో డయాలసిస్‌ చికిత్స తీసుకుంటున్నాడు. మరికొందరిలో కూడా కిడ్నీ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు సమాచారం. గ్రామంలో ఈ వ్యాధి ప్రబలడానికి కారణాలేమిటన్నది ఇంతవరకు తెలియలేదని గ్రామస్తులు చెబుతున్నారు.

                                                              అయినా... కుమారుడు దక్కలేదు

నా కుమారుడు వడ్డే అంజయ్య కిడ్నీ వ్యాధితో మూడు సంవత్సరాలు బాధపడ్డాడు. బెంగళూరు, తిరుపతి, బళ్లారి, అనంతపురం, కర్నూలు ఇలా తిరగని ఆస్పత్రి లేదు. వైద్యం కోసం చేసిన అప్పులు తీర్చేందుకు ఉన్న రెండు ఎకరాల పొలాన్నీ అమ్మేశాం. అయినా, నా కొడుకు దక్కలేదు.
                                                                                                 - హనుమక్క, మృతుడు అంజయ్య తల్లి
 

                                                              రెండుసార్లు స్పందనలో ఫిర్యాదు చేశాం

మా గ్రామంలో పలువురు కిడ్నీ వ్యాధి బారినపడి చనిపోతున్నారని ఈ ఏడాది జనవరిలో ఒకసారి, మార్చిలో మరోసారి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో స్పందనలో అర్జీ ఇచ్చాం. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి దృష్టికీ తీసుకెళ్లాం. కానీ, గ్రామంలో ఈ పరిస్థితికి కారణం ఏమిటన్నది అధ్యయనం చేయడానికి అధికారులెవరూ రాలేదు. ఇప్పటికైనా అధికారులు గ్రామంలో పర్యటించి కిడ్నీ వ్యాధి ప్రబలడానికి కారణాలపై అధ్యయనం చేయాలి. నివారణ చర్యలు తీసుకోవాలి.
                                            - ప్రభాకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌


                                                         కాళ్ల నొప్పులతో ఆస్పత్రికెళ్తే కిడ్నీ వ్యాధి అన్నారు

కాళ్ల నొప్పులు విపరీతంగా ఉన్నాయని ఆస్పత్రికి వెళ్తే వైద్యులు పరీక్షలు జరిపి కిడ్నీ వ్యాధి ఉన్నట్టు నిర్ధారించారు. ప్రస్తుతం మందులు వాడుతున్నాను. జీవితాంతం మందులు వాడాలని డాక్టర్లు చెబుతున్నారు. నెలకు నాలుగైదు వేల రూపాయలు మందులకే ఖర్చవుతోంది. వ్యవసాయంపై ఆధారపడిన మాకు నెలకు మందులకు ఇంత మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టడం కష్టంగా మారింది.
                                                                                                                    - ఈరన్న, అయ్యగార్లపల్లి