ప్రజాశక్తి-కోటనందూరు (కాకినాడ) : మెట్ట ప్రాంత ఖరీఫ్ వరి పంటలను సాగు చేస్తున్న రైతాంగానికి కండి వాగు కన్నీరు మిగిల్చింది. గత నాలుగు రోజుల నుండి అల్పపీడన ప్రభావంతో విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల కె.ఎస్ కొత్తూరు, పాతకొట్టం, కొత్త కొట్టాం గ్రామాలకు చెందిన సుమారు 170 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. ఈ పంట పొలాలకు కండి వాగు ద్వారా సాగునీరు చేరుతుంది. ఎగువ ప్రాంతాల వాగుల, చెరువులో నుండి వర్షపునీరు కండి వాగులోకి వచ్చి చేరడంతో వరి పంటలు జలమయమయ్యాయి అని రైతులు వాపోతున్నారు. సుమారు 121 మంది రైతులకు ఖరీఫ్ వరి పంట వర్షపు నీటితో మునిగిపోయి కన్నీరు మిగిల్చిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. గత రెండు రోజుల నుండి వరి పంటలు నీటిలోనే మునిగిపోయాయని రైతులు కంటతడిపెట్టారు. రైతులు రాజులు, కోరుమిల్లి తాతారావు, అడపా వెంకటేశ్వరరావు, ఎడ్ల బాబురావు, ఎడ్ల నాగసత్తిబాబు, ఎడ్ల రామచంద్రరావు, బర్ల గంగరాజు, బర్ల అప్పలరాజులు విచారం వ్యక్తం చేశారు. విత్తనాలు ఎరువులు, క్రిమిసంహారక మందులతో కలిపి ఒక ఎకరానికి సుమారు 15 వేల రూపాయల వరకు పెట్టుబడి అయ్యిందని అన్నదాతలు ఆవేదన చెందారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు.










