Sep 16,2023 20:36

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : వైసిపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో కల్లుగీత వృత్తి సంక్షోభంలో పడిందని ఆంధ్రప్రదేశ్‌ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎర్ర దేముడు అన్నారు. సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం శనివారం జుత్తిగ నరసింహమూర్తి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా దేముడు మాట్లాడుతూ.. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సందర్భంగా గీత కార్మికులకు అనేక హామీలు ఇచ్చారని, వాటిలో ఒక్కటి కూడా అమలు చేయలేదని తెలిపారు. వృత్తి ప్రమాదమని తెలిసినా కుటుంబ పోషణ కోసం చేస్తున్నారని అన్నారు. నాలుగు లక్షల మంది వృత్తిదారులను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కులాల కార్పొరేషన్లు గీత కార్మికుల కొంపలు ముంచడానికి తప్ప మరొకటి కాదని అన్నారు. కాలానికి అనుగుణంగా వృత్తిని ఆధునీకరించాలని, తాటి ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, ఎక్స్‌గ్రేషియాకు విధివిధానాలు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. వృత్తిలో దెబ్బలు తగిలిన వారికి వైద్య ఖర్చులకు పదిహేను వేల రూపాయలు, చనిపోయినవారి దహన ఖర్చులకు రూ.25 వేలు ఆర్థిక కార్పొరేషన్‌ నుంచి వెంటనే ఇప్పించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ చేతివృత్తి దారులు సమన్వయ కమిటీ కన్వీనర్‌ ఎం భాస్కరయ్య మాట్లాడుతూ.. బిసిల ఓట్లు పొందే విధంగా పాలక పార్టీలు ప్రకటనలు చేస్తున్నాయి మినహా ఆచరణలో ఉపయోగం ఏమీ లేదని విమర్శించారు. బిసి సబ్‌ప్లాను కింద రూ.38,206 కోట్లు కేటాయించామని చెప్పి కార్పొరేషన్ల ద్వారా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. ఇప్పటికైనా వృత్తిదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, లేనిపక్షంలో రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్పక తప్పదని హెచ్చరించారు.