Sep 23,2023 20:43
  • మరో ఎనిమిదింటికి వర్చువల్‌ విధానంలో జెండా ఊపనున్న మోడీ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మూడో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ను నేడు (24వ తేది) ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించనున్నారు. దీనితో పాటు మరో ఎనిమిది రైళ్లకు కూడా వర్చువల్‌ పద్దతిలో జెండా ఊపనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌తో పాటు, ముఖ్యమంత్రి కూడా పాల్గొననున్నారు. 25వ తేది (సోమవారం) నుండి ఈ రైలు ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ రైలు తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో మాత్రమే నిలుస్తుంది. విజయవాడ -  చెన్నై మధ్య ప్రయాణ సమయం 6.40 గంటలుగా రైల్వేవర్గాలు తెలిపాయి. వారంలో ఆరు రోజులు ప్రయాణీకులకు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. మంగళవారం నాడు నడవదు. ఈ రైలులో 8 కోచ్‌లు (7 ఎసి చైర్‌ కోచ్‌లు , 1 ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కార్‌ కోచ్‌) ఉంటాయి. 530 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు. ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్‌ ద్వారా లేదా రిజర్వేషన్‌ కౌంటర్ల వద్ద టిక్కెట్లను బుక్‌ చేసుకోవచ్చు. ఎమ్‌జిఆర్‌ చెన్న్తె సెంట్రల్‌ నుంచి విజయవాడకు ( రైలు నెంబరు 20677) ప్రతి రోజు ఉదయం 5.30 గంటలకు ఈ రైలు బయలుదేరుతుంది. రేణిగుంట జంక్షన్‌ ఉదయం 7.05/7.10 గంటలుకు చేరుతుంది. 8.39/8.40 గంటల మధ్యలో నెల్లూరు, 10.09/10.10కి ఒంగోలు, 11.21/11.22గంటలకు తెనాలి జంక్షన్‌, మధ్యాహ్నం12.10 గంటలకు విజయవాడకు వందేభారత్‌ ట్రైన్‌ చేరుకుంటుంది. విజయవాడ రైల్వే జంక్షన్‌ నుంచి మధ్యాహ్నం 3.20 గంటలకు ట్రైన్‌ నెంబరు (20678) బయలుదేరుతుంది. రాత్రి 10 గంటలకు చెన్నై సెంట్రల్‌కు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ చేరుకుంటుంది.

టిక్కెట్‌ ధరలు ఇలా

విజయవాడ నుంచి ఎమ్‌జిఆర్‌ చెన్నై సెంట్రల్‌కు క్యాటరింగ్‌ చార్జీతో సహా ఎసి చైర్‌ కార్‌ చార్జీ రూ.1420లు కాగా ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ ధర రూ.2,630లు. చెన్నై సెంట్రల్‌ నుంచి విజయవాడకు క్యాటరింగ్‌ చార్జీతో సహా ఎసి చైర్‌ కార్‌ చార్జీ రూ.1320లు, ఎగ్జిక్యూటివ్‌ తరగతి ధర రూ.2540లుగా రైల్వే శాఖ నిర్ణయించింది. విజయవాడ నుంచి చైన్న్తె సెంట్రల్‌కు క్యాటరింగ్‌ చార్జీని మినహాయిస్తే ఎసిచైర్‌కార్‌చార్జీరూ.1135లుగా, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ ధర రూ.2280లుగా రైల్వే శాఖ ప్రకటించింది. చెన్న్తె సెంట్రల్‌ నుంచి విజయవాడకు క్యాటరింగ్‌ చార్జీని మినహాయిస్తే ఎసిచైర్‌ కార్‌ చార్జీ రూ.1135లు, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ ధర రూ.2280గా పేర్కొన్నారు.

కాచిగూడ- యశ్వంతపూర్‌ మధ్య

కాచిగూడ - యశ్వంతపూర్‌ మధ్మ ప్రారంభం కానున్న మరో వందేభారత్‌ రైలు కూడా రాష్ట్రం మీదుగా ప్రయాణం చేస్తుంది. ఈ రైలు రాష్ట్రంలో కర్నూలు సిటీ, అనంతపురం, ధర్మవరం జంక్షన్‌లలో ఆగుతుంది. ఉదయం 5.30 కు కాచిగూడలో బయలుదేరే ఈ రైలు కర్నూలు సిటీకి ఉదయం 8.24గంటలకు, అనంతపురానికి 10.44, ధర్మవరం జంక్షన్‌కు 11.14కు, యశ్వంత్‌పూర్‌కు మధ్యాహ్నాం 2 గంటలకు చేరకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నాం 2.45 గంటలకు యశ్వంత్‌పూర్‌లో ప్రారంభమై ధర్మవరం జంక్షన్‌ (4.59) అనంతపురం (5.29) కర్నూలు (రాత్రి 7.50) కాచిగూడ(రాత్రి 11.45)కు చేరుకుంటుంది.