Oct 02,2023 11:38
  • మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పవన్‌ మౌన దీక్ష

ప్రజాశక్తి - కృష్ణా ప్రతినిధి : బ్రిటీషర్ల లక్షణాలను పుణికి పుచ్చుకున్న పాలకులు రాష్ట్రంలో ఉన్నారని, ప్రజలను విభజించి పాలించే ధోరణితో వెళుతున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. గాంధీ చెప్పిన ఓటు, సత్యాగ్రహం ఆయుధాలను ఉపయోగించి నయా బ్రిటీష్‌ పాలకులను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని కోరారు. మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రెండు గంటల సేపు పవన్‌ కల్యాణ్‌ మౌన దీక్ష చేపట్టారు. వారాహి నాలుగో విడత యాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ముందుగా మచిలీపట్నం సువర్ణ కల్యాణ మండపంలో గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్‌ బహుదూర్‌ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలుల వేసి నివాళులర్పించారు. జనసేన పార్టీ జిల్లా కార్యవర్గంతో కలిసి జాతి నేతలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. సత్యం, అహింసా, శాంతి, సహనాలను పాటిస్తూ ఎన్ని కష్టాలెదురైనా ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని మహాత్మా గాంధీ నిరూపించారని, ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళతామని అన్నారు. అహింసాయుతమైన ప్రజా ఉద్యమాలతో పరాయి పాలన నుంచి దేశాన్ని విముక్తి చేశారని గుర్తుచేశారు. అనంతరం మౌన దీక్ష చేపట్టారు. దీక్ష విరమణ అనంతరం జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులతో సమావేశమయ్యారు.