Sep 17,2023 06:50
  • పొత్తులపై మోడీ, షాలకువివరిస్తా
  • పార్టీ విస్తృత స్ధాయి సమావేశంలో పవన్‌కల్యాణ్‌

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఎన్‌డిఎలో భాగంగానే జనసేన ఉందని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. మంగళగిరి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన జనసేన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీతో పొత్తులను ఏ పరిస్థితుల్లో ప్రకటించాల్సివచ్చిందో బిజెపి నాయకత్వానికి వివరిస్తానని చెప్పారు. 'రాజమండ్రిలో పొత్తుల ప్రకటన ఏ పరిస్థితుల్లో చేయాల్సివచ్చిందో, దానికి కారణాలేమిటో ప్రధాని మోడీ, కేంద్ర హోమ్‌శాఖ మంత్రి అమిత్‌షాకు వివరిస్తా. దీనికోసం త్వరలోనే ఢిల్లీ వెడతా' అని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మానస్థిక స్థితి సరిగా లేదేమోనని అనిపిస్తోందని అన్నారు. ఢిల్లీ వెళ్లిన సందర్భంలో ఓ సైక్రియాటిస్ట్‌ డాక్టర్ల బృందాన్ని రాష్ట్రానికి పంపాలని కేంద్రాన్ని అడగాలనిపిస్తోందన్నారు. .

పొత్తుల కమిటీ అధ్యక్షునిగా నాదెండ్ల

తెలుగుదేశం పార్టీతో ఎన్నికల పొత్తు, సీట్ల సర్దుబాటు గురించి చర్చించేందుకు జనసేన తరపున సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. దీనికి నాదెండ్ల మనోహర్‌ అధ్యక్షునిగా నియమిస్తున్నట్లు చెప్పారు.