ప్రజాశక్తి- నందిగామ (ఎన్‌టిఆర్) : మెప్మా ఆధ్వర్యంలో చౌకగా భోజనంతోపాటు ఇతర ఆహార పదార్థాలు అందించటానికి ప్రభుత్వం కఅషి చేస్తున్నదని నందిగామ ఎంఎల్‌ఎ మొండితోక జగన్ మోహన్‌రావు అన్నారు. నందిగామ గాంధీ సెంటర్ లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆహా భోజనం క్యాంటీన్ ను నందిగామ ఎంఎల్‌ఎ మొండితోక జగన్ మోహన్ రావు మంగళవారం ప్రారంభించారు.
ముందుగా ఆహార పదార్థాలను రుచి చూసి పొదుపు సంఘాల మహిళలతో మాట్లాడి క్యాంటీన్ నిర్వహణపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎంఎల్‌ఎ జగన్ మోహన్ రావు మాట్లాడుతూ .... మహిళలకు అండగా వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రూ.40 కే భోజనం అందించడం మంచి పరిణామమన్నారు. పేదలకు, కార్మికులకు, కూలీలకు ఈ ఆహా క్యాంటీన్ ఎంతో ప్రయోజనకరమని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేవారి, మార్కెట్లకు వచ్చేవారి, చిరు వ్యాపారుల ఆకలి తీర్చేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో ఆహా క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేసిందన్నారు. రాష్ట్రంలోని పట్టణాల్లో ఉన్న స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయం అందిస్తుందని చెప్పారు. ఆహా క్యాంటీన్ల యూనిట్ ఏర్పాటుకు ముందుకు వచ్చే సంఘ సభ్యులకు రూ.15 వేల చొప్పున ప్రభుత్వం అందజేసి క్యాంటీన్ నిర్వహణకు సహకరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ జయరాం, స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.










