Oct 09,2023 21:32

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికలు సమీపించడంతో వైసిపి అధినేత జగన్‌కు ఆ పార్టీ ప్రజా ప్రతినిధులపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు విమర్శించారు. నాలుగున్నరేళ్లుగా వైసిపి ప్రతినిధులు జగన్‌ కంటికి కనిపించలేదని, తాడేపల్లి ప్యాలెస్‌లోకి వారికి అనుమతి లేదని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పంచాయతీల నిధులు రూ.8,600 కోట్లు దారి మళ్లింపును ప్రశ్నించిన వైసిపి సర్పంచులపై లాఠీఛార్జ్‌ చేయించి అక్రమ కేసులతో జైల్లో పెట్టారని అన్నారు. పేదలపై కొంగజపం చేస్తూ కపట ప్రేమ చూపుతున్నారని విమర్శించారు. జగన్‌ను మించిన పెత్తందారు మరెవరూ లేరని, పేదల ద్రోహి జగన్‌ మాత్రమేనని ఆరోపించారు. లక్ష బ్యాగ్‌లాగ్‌ పోస్టుల భర్తీ చేయకుండా బడుగు, బలహీన వర్గాలను దగా చేశారని విమర్శించారు. వై నాట్‌ పులివెందుల అని ప్రజలు అంటున్నారని తెలిపారు. పవన్‌పై నిత్యం అబద్ధాలు ప్రచారం చేస్తూ ఎందుకు రెచ్చగొట్టే కుట్ర చేస్తున్నారని ప్రశ్నించారు.
ప్రభుత్వం కోసం పనిచేయాల్సిన ఎపి డిజిటల్‌ కార్పొరేషన్‌ను వైసిపి రాజకీయ అవసరాలు, ప్రచార పిచ్చికి దుర్వినియోగం చేస్తుందని టిడిపి అధికార ప్రతినిధి విజరుకుమార్‌ విమర్శించారు. వైసిపి సోషల్‌ మీడియా సిబ్బందే ఎపి డిజిటల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులు అని విలేకరుల సమావేశంలో ఆరోపించారు. దాదాపు 125 మంది వైసిపికి చెందిన వారిని నిబంధనలు, రాతపరీక్షలు నిర్వహించకుండా నియమించారని విమర్శించారు.