- అభ్యంతరం వ్యక్తం చేస్తూ జైళ్ల శాఖ డిఐజికి టిడిపి నాయకుల వినతి
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం:స్కిల్ స్కామ్ కేసులో నిందితునిగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడుకు జైలు అధికారులు లీగల్ ములాఖత్‌ను కుదించారు. 39 రోజులుగా జైల్లో ఉన్న ఆయనను రోజూ రెండుసార్లు న్యాయవాదులు కలుస్తున్నారు. అయితే, సోమవారం నుంచి రోజుకు ఒక్కసారి మాత్రమే లీగల్ ములాఖత్ ఉంటుందని జైలు అధికారులు తేల్చి చెప్పారు. దీనిపై టిడిపి నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లీగల్ ములాఖత్‌లపై ఆంక్షలు తొలగించాలని కోరుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన టిడిపి ముఖ్య నాయకులు జైళ్ల శాఖ డిఐజి రవికిరణ్‌ను కలిసి మంగళవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు న్యాయపోరాటానికి అడ్డంకులు సృష్టించేందుకే ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తెచ్చి లీగల్ ములాఖత్‌లపై ఆంక్షలు పెట్టిందని విమర్శించారు. చంద్రబాబుపై కేసులపై కేసులు పెడుతున్నారని, వీటిపై పోరాటం కోసం ఆయన నిత్యం న్యాయవాదులతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని తెలిపారు. లీగల్ ములాఖత్‌లపై ఆంక్షలు తొలగించాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో టిడిపి నాయకులు నిమ్మకాలయ చినరాజప్ప, జవహర్, బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ, వేగుళ్ల జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బూరుగుపల్లి శేషారావు, ఎస్‌విఎస్‌ఎన్.వర్మ, బడ్డు వెంకటరమణచౌదరి, మద్దిపాటి వెంకట రాజు తదితరులు ఉన్నారు.
- హెల్త్ బులెటిన్ ప్రతిని చంద్రబాబుకు అందించాలి
- ఎసిబి న్యాయమూర్తి ఆదేశం
చంద్రబాబునాయుడుని మంగళవారం ఉదయం పది గంటలకు ఎసిబి న్యాయమూర్తి ఎదుట వర్చువల్‌గా జైలు అధికారులు హాజరయ్యారు. చంద్రబాబు హెల్త్ బులెటిన్ విషయంంలో ఆయన తరుపు లాయర్లు పిటిషన్ వేశారు. ఇకపై వైద్య నివేదిక ప్రతిని చంద్రబాబుకు అందజేయాలని కోర్టు ఆదేశించింది. చంద్రబాబు తరుపు లాయర్ల పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సిఐడికి నిర్దేశించింది. సిఐడి తరుఫు న్యాయవాదులు మంగళవారం సాయంత్రం కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
- నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం
- హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసిన జైలు సూపరింటెండెంట్
చంద్రబాబునాయుడు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యుల బృందం తెలిపింది. ఈ మేరకు జైలు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ మంగళవారం రాత్రి చంద్రబాబు ఆరోగ్యస్థితిపై అధికారిక నివేదికను పత్రికలకు విడుదల చేశారు. జైలు వైద్య అధికారులు, రాజమహేంద్రవరం జిజిహెచ్ వైద్యుల బృందం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిందని ఈ నివేదికలో పేర్కొన్నారు. బ్లెడ్ ప్రెజర్130 / 80 ఎంఎంహెచ్‌జి, టెంపరేజర్ - నార్మల్, పల్స్ 68/మినిట్, రెస్సిరేటరీ రేట్ 12/మినిట్, ఎస్‌పిఒ2 - 97 శాతం, హార్ట్ - ఎస్1ప్లస్, ఎస్2ప్లస్, లంగ్స్- క్లియర్, ఫిజికల్ యాక్టివిటీ - గుడ్, వెయిట్ - 67 కేజీలు ఉన్నట్టు వివరించారు.










