- 5 రాష్ట్రాల్లో చేసింది మీరు చేయలేరా?
- జిపిఎస్‌ను వ్యతిరేకిస్తూ మండలిలో వాయిదా తీర్మానం
- తిరస్కరించిన ఛైర్మన్
- పిడిఎఫ్ సభ్యుల నిరసన
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో ప్రభుత్వ, ఉద్యోగ, ఉపాధ్యాయులకు అమల్లో ఉన్న సిపిఎస్‌ను రద్దు చేయాలని, జిపిఎస్ ప్రతిపాదన ఉపసంహరించుకుని ఒపిఎస్‌ను అమలు చేసి ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోవాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం శాసనమండలిలో వాయిదా తీర్మానం ఇచ్చారు. దీనికి ఛైర్మన్ కొయ్యే మోషెన్‌రాజు తిరస్కరించారు. తీర్మానంపై చర్చకు పిడిఎఫ్ ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, ఐ వెంకటేశ్వరరావు, షేక్ సాబ్జీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువర్మ పట్టుబట్టారు. మరో రూపంలో ఈ అంశంపై చర్చిద్దామని ఛైర్మన్ చెప్పారు. సిఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి సిపిఎస్ స్థానంలో ఒపిఎస్ అమలు చేయాలని లక్ష్మణరావు, సాబ్జీ డిమాండ్ చేశారు. సిపిఎస్ స్థానంలో జిపిఎస్ పెట్టాలన్న ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నామన్నారు. మూడు లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. వాయిదా తీర్మానం తిరస్కరించినా వేరే రూపంలో చర్చిస్తామని ఛైర్మన్ పేర్కొన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఒపిఎస్‌ను తిరిగి అమలు చేస్తున్నాయని తెలిపారు. అనంతరం పిడిఎఫ్ ఎమ్మెల్సీలు మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. పాదయాత్రతోపాటు ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని సిఎం జగన్ విస్మరించడం దారుణమన్నారు. పేరు మార్పు ఏదైనా జిపిఎస్ కూడా సిపిఎస్‌కు కొనసాగింపుగానే పరిగణిస్తామన్నారు. దీనివల్ల ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదన్నారు. ప్రభుత్వం అనుకున్న పద్ధతుల్లో ముందుకు వెళ్తుందని ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ పట్టించుకోకపోవడం శోచనీయం అన్నారు. పిడిఎఫ్ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఒపిఎస్ మాత్రమే ప్రత్యామ్నాయంగా చెప్పారు. వైఎస్ జగన్ చెప్పారంటే... చెస్తారంటే నినాదాన్ని నిలబెట్టుకోవాలని, లేదా దీనిని మాట తప్పడం, మడప తిప్పడంగానే భావిస్తామన్నారు. దీనికి సిఎం జగన్ సమాధానం చెప్పాలన్నారు. జిపిఎస్‌లో కూడా కంట్రిబ్యూషన్ మాట ఉన్నప్పుడు ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదన్నారు. కేవలం అంకెల్లో మార్పు మాత్రమే చూపిస్తున్నారన్నారు. సిపిఎస్ స్థానంలో జిపిఎస్‌ను ఉద్యోగ, ఉపాధ్యాయులంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారని అన్నారు.
ఉద్యోగ సంఘాలన్నీ అంగీకరించాయని మంత్రి బత్స సత్యనారాయణ ప్రకటించడం సరికాదన్నారు. ఇప్పుడున్న ఉద్యోగ సంఘాలకు ఎవరు అధికారం ఇచ్చారు? ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. బప్పరాజు, బండి శ్రీనివాసరావు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించి మూడు లక్షల మంది ప్రయోజనాలను తాకట్టుపెట్టారని అన్నారు. తాము ఒపిఎస్ కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు. సిపిఎస్‌కు ఒపిఎస్ మాత్రమే ప్రత్యామ్నాయం అని స్పష్టం చేశారు. దేశంలో సిపిఎస్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభమైన తరువాత ఐదు రాష్ట్రాల్లో సిపిఎస్ రద్దు చేశారన్నారు. ఐదు రాష్ట్రాల్లో సాధ్యపడగా ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. సిపిఎస్ అరగుండు... జిపిఎస్ అంటే బోడిగుండు... అని వ్యాఖ్యానించారు. నిరంకుశంగా వ్యవహరిస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతి ఈ ప్రభుత్వానికీ పడుతుందన్నారు. జిపిఎస్ బిల్లును తాము సభలోనే వ్యతిరేకిస్తామన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని అధికారంలో కొనసాగుతారో లేక ఓడిపోతారో సిఎం జగన్ తేల్చుకోవాలన్నారు.










