- విత్తనాలు ఫెయిలై ఏడాది
- వ్యవహారం కమిషనర్ కోర్టుకు
- మార్కెట్‌లో యథేచ్ఛగా ప్రొడక్ట్స్
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : నిరుడు ఖరీఫ్‌లో కావేరి సీడ్స్ కంపెనీకి చెందిన 'జాదు' పత్తి విత్తనాలతో భారీ నష్టాలు చవిచూసిన రైతులకు పరిహారం ఏడాది తిరిగొచ్చినా ఏ మాత్రం తెమలట్లేదు. తాజాగా హైకోర్టు ఆదేశాలతో వ్యవహారం వ్యవసాయ కమిషనర్ దగ్గరకొచ్చింది. కాగా లేబరేటరీ పరీక్షలు, సైంటిస్టుల అధ్యయనాల్లో కావేరి పత్తి విత్తనాలు విఫలమయ్యాయని నిర్ధారించినా, సదరు కంపెనీ రాష్ట్రంలో యధేచ్ఛగా విత్తనాలను విక్రయించడంపై విమర్శలొస్తున్నాయి. చట్ట ప్రకారం కంపెనీపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం వల్లమాలిన ప్రేమ కురిపిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కావేరి కంపెనీ ముఖ్యుల్లో ఒకరిద్దరికి తెలంగాణ ప్రభుత్వంలోని కొందరు ప్రముఖులతో సన్నిహిత సంబంధాలున్నాయని, వారు ఇక్కడి ప్రభుత్వంలోని పెద్దల వద్ద పైరవీ చేసిన కారణంగా కావేరిపై ఎపిలో చర్యలు లేవని చెబుతున్నారు. రైతులకు నష్ట పరిహారం చెల్లించాలంటూ వ్యవసాయశాఖ జెడిఎ జారీ చేసిన అవార్డ్‌ను పరిహారం ఎగ్గొట్టే ఎత్తుతో కావేరి సంస్థ కోర్టులో సవాల్ చేయగా, ఇప్పుడు కోర్టే కమిషనర్ వద్ద తేల్చుకోవాలనడంతో బాధిత రైతాంగానికి న్యాయం జరుగుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
ఇదీ కథ
2021-22 ఖరీఫ్‌లో కావేరి కంపెనీకి చెందిన జాదు బిటి పత్తి విత్తనాలు విఫలం కావడంతో రైతులు నష్టపోయారు. పూత, పిందె, పురుగును తట్టుకొనే విషయాల్లో కంపెనీ పేర్కొన్న విధంగా లేవు. అప్పటి కర్నూలు, కృష్ణా, గుంటూరు తదితర జిల్లాల నుండి ఫిర్యాదులొచ్చాయి. కర్నూలులో సమస్య తీవ్రంగా ఉండటంతో విత్తనాలను ల్యాబుల్లో పరీక్షించారు. శాస్త్రవేత్తలు పొలాలు పరిశీలించి సర్కారుకు రిపోర్టు ఇచ్చారు. విత్తనాల ఫెయిల్యూరే కారణమని నిర్ధారించారు. కావేరి కంపెనీ ఎకరానికి మూడు క్వింటాళ్ల చొప్పున బాధిత రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలంటూ ఎపి కాటన్ సీడ్ యాక్ట్ ప్రకారం జిల్లా వ్యవసాయాధికారి (జెడిఎ) ఆర్డర్ ఇచ్చారు. జెడిఎ అవార్డ్‌పై కావేరి సంస్థ హైకోర్టుకెళ్లింది. విచారించిన హైకోర్టు జెడిఎ అవార్డ్‌పై అప్పిలేట్ అథారిటీ అయిన కమిషనర్ వద్ద తేల్చుకోవాలంది. వ్యవసాయశాఖ అండదండలు పుష్కలంగా ఉన్న కావేరి నుండి కమిషనర్ అయినా పరిహారం ఇప్పిచేనా అని రైతులు ఆందోళనగా ఉన్నారు.
రెడ్ కార్పేట్
నకిలీ, కల్తీ, నాసిరకం విత్తనాలకు ఆస్కారమే లేదన్న ప్రభుత్వం అక్రమాలకు పాల్పడ్డట్లు రుజువైన కావేరిపై కనికరం చూపించడం విమర్శలకు తావిస్తోంది. సంస్థపై ఎలాంటి చర్యలూ, నియంత్రణ లూ చేపట్టకపోవడంపై ఆరోపణలొస్తున్నాయి. ఈ ఖరీఫ్‌లోనూ సదరు కంపెనీ యథేచ్ఛగా విత్తనాలు విక్రయిస్తోందని చెబుతున్నారు. పైగా సదరు సంస్థ ఉత్పత్తులను ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె)లో అమ్ముకునేందుకు అనుమతులూ ఇచ్చినట్లు ఆరోపణలొస్తున్నాయి. 2007- ఎపి కాటన్ సీడ్ యాక్ట్ ప్రకారం అక్రమాలు చేసిన కంపెనీలు, డీలర్లపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని, రైతులకు పరిహారం సైతం ఇప్పించొచ్చని, కమిషనర్ ఇచ్చే ఆర్డర్‌పై కంపెనీ ఏ కోర్టులోనూ సవాల్ చేసే అవకాశం లేదని, అయినప్పటికీ వ్యవసాయశాఖ రైతుల పక్షాన పని చేయడం లేదని ఆరోపణలొస్తున్నాయి.










