'ఆ రేపిస్టులు బ్రాహ్మణులు.. బ్రాహ్మణులు మంచిబుద్ధి కలవారు..' అంటూ బిల్కిస్ బానో అత్యాచార నిందితులను విడుదల చేయడాన్ని సమర్ధించుకున్న ఆ ప్రబుద్ధులు మనువాదాన్ని నరనరాన ఒంటబట్టించుకున్నవారు. మహిళలు ఏ బట్టలు వేసుకోవాలి? భర్తతో ఎలా ఉండాలి? ఎలా నడవాలి? ఎలా మాట్లాడాలి? అంటూ నిత్యం స్త్రీలను కించపరుస్తూ.. వేధిస్తూ.. పిచ్చివాగుడు వాగుతూ పురుషాధిక్యత చాటిచెప్పుకుంటుంటారు. ఆ చేష్టలకు పరాకాష్టగా ఇప్పుడు .. పసిపిల్లలను నిర్దాక్షిణ్యంగా చంపేసిన, గర్భిణీ అని చూడకుండా పాశవికంగా అత్యాచారం చేసిన నిందితులు బ్రాహ్మణులు కాబట్టి వాళ్లు చేసిన నేరం.. నేరం కాకుండా పోయిందని వాగుతున్నారు.
విచారణా కమిటీ, కమిటీ ప్రతిపాదించిన ప్రభుత్వం, నిందితులంతా బ్రాహ్మణులైనంత మాత్రాన ఆ ఘోరం న్యాయమైపోతుందా? కులాన్ని బట్టి వ్యక్తిత్వాలను నిర్దేశించే మనువాదకుల కంటికి ఇంతటి అమానుషం న్యాయంగా కనిపించిందా? మనువాదం తలకెక్కిన వాళ్లకి వాళ్లు చేసిన నేరాలు, ఘోరాలు సమర్థనీయంగా కనిపిస్తాయి. అది వారి జన్మహక్కుగా భావిస్తారు. మతం మానవత్వాన్ని పంచమంటుంది. మతోన్మాదం మనుషులను చంపమంటుంది. ఈ తేడా గుర్తించనంతకాలం వందల ఏళ్లైనా ఈ ఉన్మాదం అంతమవ్వదు.
'బిల్కిస్ బానో ఎవరో నాకు తెలియదు. ఆమెకు ఏం జరిగిందో తెలియదు. సుప్రీం మార్గనిర్దేశాలనుసరించి రాష్ట్రప్రభుత్వం మా కమిటీని ఏర్పాటు చేసింది. 11 మంది నిందితుల ప్రవర్తనను మేం పరిశీలించాం. జైలరును సంప్రదించాం. జైలులో వారు చాలా శాంతియుత జీవనం సాగిస్తున్నారని, ఎటువంటి అల్లర్లకు, హింసకు పాల్పడలేదని మాకు తెలిసింది. పైగా నిందితులు బ్రాహ్మణులు. బ్రాహ్మణులు చాలా మంచివారు' అని నిస్సిగ్గుగా తమ చర్యను సమర్ధించుకున్న కమిటీ సభ్యులకు ఆలయంలో పసిమొగ్గను చిదిమేసిన పూజారి ఘాతుకం, ('ఉన్నావ్' బాలిక ఘటన) అర్ధరాత్రి అత్యాచార బాధితురాలి శవాన్ని తగలబెట్టడం ('హత్రాస్' ఘోరకలి), దేశంలో నిత్యం మహిళలు, మైనారీటీలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలన్నీ కూడా న్యాయంగా కనిపిస్తాయేమో!
మూకుమ్మడిగా నిందితులంతా జైలు గోడలనుంచి బయటకు వచ్చారన్న వార్త వినగానే బిల్కిస్ నిలువెల్లా కంపించిపోయింది. నిశ్చేష్టురాలై చాలా సేపటికి వరకు తేరుకోలేదని చెబుతూ 'ఈ తీర్పుతో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏ స్త్రీకైనా న్యాయం ఇలా ముగుస్తుందా? మన దేశంలోని న్యాయవ్యవస్థను నేను ఎంతో విశ్వసించాను. నా జీవితంలో జరిగిన గాయం ప్రతిరోజూ నన్ను వెంటాడుతుంది. ఆ బాధను దిగమింగుకుని జీవిస్తున్న నేను, నా కుటుంబం ఇప్పుడు భయంతో వణికిపోతున్నాం. మా భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. నా దు:ఖం, నా విశ్వాసం నాకు మాత్రమే సంబంధించినది కాదు. నాలాగే న్యాయం కోసం పోరాడుతున్న ఎంతోమంది మహిళలది' అంటూ ఆవేదన చెందుతోంది.
'సామూహిక అత్యాచారం ఘోరమైన నేరమా? తమ శక్తినంతా ఉపయోగించి స్త్రీలపై దాడిచేసిన పురుషులను సమాజం క్షమించకూడదా? అత్యాచార నేరాన్ని క్రూరత్వంగా పరిగణించాలా? అన్న ప్రశ్నలను సమర్థిస్తోంది ఈ తీర్పు. అంతేకాదు భారతదేశం 'నిర్భయ' లాంటి ఘటనల నుంచి ఎప్పటికీ విముక్తి కాదని సూచిస్తోంది.
గర్భిణీపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి ఆమె మూడేళ్ల బిడ్డను రాయిపై కొట్టి చంపేసిన నిందితుల పట్ల మెతక వైఖరి అవలంబించడం దేనికి సంకేతం? మానవత్వం మరిచిపోయిన ఈ మనువాదులకు ఆ నేరం ఎందుకు భయంకరంగా కనిపించలేదు. మతోన్మాదంతో హిందూాముస్లిం మధ్య జరిగిన ఘర్షణగా దీన్ని లెక్కించడం సమంజసమా? ఇది మతాలకతీతమైన సమస్య. మహిళల గౌరవానికి, న్యాయానికి సంబంధించినది. ఈ తీర్పు నిర్భయలాంటి మరెన్నో నేరాలకు ఉసిగొల్పుతుంది. ముఖ్యంగా నిందితులకు సహాయం చేసేందుకు, మతాన్ని అడ్డుపెట్టుకునే రాజకీయ నాయకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని సూచిస్తోంది.
వందల ఏళ్ల బానిసత్వ సంకెళ్లను ఛేదించి, స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు సాధించిన స్వాతంత్య్ర పోరాట యోధులను స్మరిస్తున్న వేళ మహిళలను, పిల్లలను అత్యంత కిరాతకంగా హత్యలు, అత్యాచారాలు చేసిన నిందితులు జైలు గోడల నుంచి బయటకురావడం దేనికి సంకేతం? ఒకపక్క 'బేటీ బచావో.. బేటీ పడావో' అంటూ మహిళల ఉజ్వల భవిష్యత్తుకై పాటుపడుతున్నామని కల్లబల్లి కబుర్లు చెప్పే ప్రధాని మోడీ మహిళల భద్రత, రక్షణ గురించి చెబుతున్న ప్రతివిషయమూ బూటకమని ఈ తీర్పుతో తేలిపోయింది. బిల్కిస్ నిందితులు స్వేచ్ఛగా వీధుల్లో తిరుగుతున్న వేళ దేశం తలవొంచుకుని మౌనంగా రోదిస్తోంది.
బిల్కిస్‌కు అండగా దేశవ్యాప్త ఉద్యమం నడవాల్సిన సమయమిది. ఇప్పటికే ఉద్యమకారులు, ప్రముఖ రచయితలు, చరిత్రకారులు, చిత్రనిర్మాతలు, పాత్రికేయులు, మాజీ బ్యూరోక్రాటులు దాదాపు ఆరు వేల మంది ఈ తీర్పును రద్దు చేయాల్సిందిగా సుప్రీంకోర్టును కోరారు. ఆ బాటలో మరెంతోమంది నడవాలి. బిల్కిస్‌కు, అన్యాయానికి గురైన దేశ మహిళలకు అండగా నిలవాలి.
బాక్స్
'ఒక మహిళగా, ఒక సివిల్ సర్వెంట్‌గా నేను ఈ తీర్పును నమ్మలేకపోయాను. ఆమెకు స్వేచ్ఛగా, భయం లేకుండా జీవించే హక్కును తుడిచేసి మనది స్వేచ్ఛాయుత దేశంగా ఎలా చెప్పుకుంటామని?' ఆవేదన వ్యక్తం చేసిన మహిళా ఐపిఎస్ అధికారి స్మిత సభర్వాల్ జైలు గోడల బయట మిఠాయిలు తింటూ పూలమాలలు ధరించిన నిందితులను అలా చూసి ఒక్క క్షణం కదలలేకుండా అలా కూర్చొండిపోయాను' అంటున్నారు.
'ఈ తీర్పు చాలా అన్యాయమైంది. దీన్ని ఆసరాగా తీసుకుని ఇతర అత్యాచారం, హత్యల కేసుల నిందితులు ఉపశమనం పొందే వీలుంటుంద'ని బిల్కిస్ కేసు విచారించి 2008లో నిందితులకు జీవితఖైదు విధించిన విశ్రాంత న్యాయమూర్తి యుడి సాల్వి ఆందోళన చెందుతున్నారు. 'మైనార్టీలకు వ్యతిరేకంగా హింసకు పాల్పడేవారికి భారతదేశంలో ఎప్పటికీ శిక్ష పడదని ఈ తీర్పు చెబుతోంది' అంటూ యుఎస్ కమిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ (యుఎస్‌సిఐఆర్‌ఎఫ్) ఈ చర్యను తీవ్రంగా ఖండించింది.










