ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అవినీతి కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న చంద్రబాబుకు సంఘీభావంగా మహాత్మా గాంధీ జయంతి రోజున టిడిపి దీక్షలు చేయడం సిగ్గుచేటని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు సోమవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. సజ్జలతోపాటు మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, మాజీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్, శిద్ధా రాఘవరావు, డొక్కా మాణిక్య వరప్రసాద్, శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపి నందిగం సురేష్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, ఎమ్మెల్యేలు కైలే అనిల్‌కుమార్ తదితరులు నివాళులర్పించారు. అనంతరం సజ్జల మాట్లాడుతూ.. గాంధీ జయంతి రోజున చంద్రబాబు నిరాహార దీక్ష చేయడం సరైంది కాదన్నారు. ఒకప్పుడు ధనవంతులే ఫ్యామిలీ డాక్టర్‌ను పెట్టుకునేవారని, ఇప్పుడు ప్రతి ఇంటికీ ఫ్యామిలీ డాక్టర్‌ను ప్రభుత్వం నియమించిందని అన్నారు.