Apr 25,2023 15:20
  • డబ్ల్యూటిసి ఫైనల్‌కు జట్టును ప్రకటించిన బిసిసిఐ

ముంబయి: లండన్‌లోని ఓవల్‌ వేదికగా జరిగే ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌(డబ్ల్యుటిసి) ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడే జట్టును భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) మంగళవారం ప్రకటించింది. ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌)లో నిలకడగా రాణిస్తోన్న సీనియర్‌ బ్యాటర్‌ అజింక్యా రహానేకు చోటు దక్కింది. ఐపిఎల్‌లో చెన్నై తరఫున ఆడుతున్న రహానే 5మ్యాచుల్లో 209పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు. దేశవాళీ టోర్నమెంట్‌ రంజీట్రోఫీలో ముంబయి తరఫున 11 ఇన్నింగ్స్‌లో 57.63యావరేజ్‌తో 634పరుగులు చేశాడు. అందులో ఓ డబుల్‌ సెంచరీ(204) కూడా ఉంది. ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్‌ సిరీస్‌ నుంచి రహానే భారతజట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. భారతజట్టు మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ గాయం కారణంగా డబ్ల్యుటిసి ఫైనల్‌కు దూరం కావడంతో 34ఏళ్ల అజింక్యా రహానేకు జట్టులో చోటు దక్కింది. ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌ సిరీస్‌కు చోటు దక్కని కేఎల్‌ రాహుల్‌కు బిసిసిఐ ప్రకటించిన 15మంది జట్టులో చోటు లభించింది. ఇక భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఓవల్‌ వేదికగా జూన్‌ 7న డబ్ల్యుటిసి ఫైనల్‌ మ్యాచ్‌ జరగనున్న సంగతి తెలిసిందే.
జట్టు: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, పుజారా, విరాట్‌ కోహ్లి, అజింక్య రహానే, కేఎల్‌ రాహుల్‌, శ్రీకర్‌ భరత్‌, అశ్విన్‌, జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీ, సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, ఉనద్కత్‌.