Jul 12,2022 07:16
  • 2023 నాటికి చైనాను దాటనున్న ఇండియా
  • నవంబర్‌ నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లు
  • ఐరాస నివేదిక

న్యూయార్క్‌ : వచ్చే ఏడాది నాటికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా చైనాను దాటి భారత్‌ నిలవనుందని ఐక్యరాజ్యసమితి (ఐరాస) అంచనావేసింది. జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని '2022 ప్రపంచ జనాభా అంచనాల' నివేదికను ఐరాస సోమవారం విడుదల చేసింది. ఈ ఏడాది నవంబర్‌ నాటికి ప్రపంచంలోని మొత్తం జనాభా 800 కోట్ల మార్క్‌ను తాకే అవకాశముందని తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన తొలి రెండు ప్రాంతాలుగా తూర్పు, ఆగేయాసియా ప్రాంతాలు నిలిచాయని ఐరాస నివేదిక వెల్లడించింది. ఈ రెండు ప్రాంతాల్లో మొత్తం 230 కోట్ల జనాభా ఉండగా, ప్రపంచ జనాభాలో 29 శాతం ఇక్కడే నివసిస్తున్నారు. ఇక 210 కోట్ల జనాభాతో దక్షిణాసియా, మధ్య ఆసియా ప్రాంతాలు తర్వాతి స్థానంలో నిలిచాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలు కూడా ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఈ జాబితాలో చైనా ప్రథమ స్థానంలో ఉండగా, భారత్‌ రెండోస్థానంలో ఉంది. అయితే..2023 నాటికి ఈ ర్యాంకుల్లో కాస్త మార్పు రాబోతోందని నివేదిక వెల్లడించింది. ఐరాస గణాంకాల ప్రకారం, ప్రస్తుతం చైనా జనాభా 142.6కోట్లు కాగా, భారత్‌ జనాభా 141.2కోట్లుగా ఉంది. 2050 నాటికి భారత జనాభా 166.8 కోట్లకు చేరనుందని ఐరాస అంచనా వేసింది. అదే సమయంలో చైనా జనాభా 131.7 కోట్లకు తగ్గే అవకాశముందని తెలిపింది.
 

                                                                 ప్రపంచ జనాభా 800 కోట్లకు..

ఈ ఏడాది నవంబర్‌ 15నాటికి ప్రపంచ జనాభా 800 కోట్ల మార్క్‌ను తాకే అవకాశముందని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది. 2030 నాటికి ఈ సంఖ్య 850కోట్లు...2050 నాటికి 970 కోట్లకు చేరే అవకాశముందని తెలిపింది. ''ఈ ఏడాది ప్రపంచ జనాభాలో సరికొత్త మైలురాయిని చేరుకోనున్నాం. ఈ ఏడాదిలోనే ఈ భూమ్మీద 800కోట్లవ శిశువు జన్మించే అవకాశముందని అంచనావేస్తున్నాం. మన వైవిధ్యతను వేడుక చేసుకునే సందర్భం అది. ఆరోగ్య ప్రమాణాల్లో మరింత పురోగతి సాధిస్తున్నాం. ఆయుర్దాయం పెరుగుతోంది. మాతా, శిశు మరణాల రేట్లు కూడా తగ్గుతున్నాయి'' అని ఐరాస ప్రధాన కార్యదర్శి జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ ఈ సందర్భంగా తెలిపారు. అయితే అదే సమయంలో ఈ భూమండలాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీదా ఉందన్నార