Jan 03,2023 21:14

న్యూఢిల్లీ : చమురు ఉత్పత్తుల తయారీపై పన్నులను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం, ముడి చమురు, ఏవియేషన్‌ టర్వైన్‌ ఫ్యూయల్‌ (ఎటిఎఫ్‌) ఇంధనాలపై ఇది వర్తిస్తుందని మంగళవారం వెల్లడించింది. టన్ను ముడి చమురు ఉత్పత్తిపై విండ్‌ఫల్‌ టాక్స్‌ను రూ.2100 (25.38 డాలర్ల)కు పెంచింది. ఇంతక్రితం ఇది రూ.1,700 (20.55 డాలర్లు)గా ఉంది. పెంచిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. అదే విధంగా డీజిల్‌ ఎగుమతులపై లీటర్‌కు రూ.7.5 పన్ను (విండ్‌ఫల్‌ టాక్స్‌)ను విధిస్తున్నట్లు తెలిపింది. ఇంతక్రితం దీనిపై పన్ను రూ.5గా ఉంది. లీటర్‌ ఎటిఎఫ్‌పై పన్నును రూ.1.5 నుంచి రూ.4.5కు చేర్చింది. ప్రపంచంలోనే భారత్‌ అతి ఎక్కువ చమురు కొనుగోళ్లలో ఒక్కటిగా ఉంది. రష్యన్‌ చమురును బ్యారెల్‌కు 60 డాలర్ల లోపు చెల్లించి కొనుగోలు చేస్తుంది. చమురు తయారీపై పన్నులు పెంచడం ద్వారా ఆ మొత్తం వినియోగదారులపై భారం పడనుంది. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగనున్నాయి.