ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్ర ఖజానాలో బిల్లుల చెల్లింపులకు నిధులు లేక ఒకవైపు ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు కొద్దిపాటి బిల్లుల చెల్లింపులకు కూడా చేతివాటం ఎక్కువైనట్లు కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికశాఖ ఉన్నతాధికారుల పేషీల్లోనే పెత్తనం అంతా కనిపిస్తుందని, చదివింపులు ఉంటేనే బిల్లులు మంజూరవుతున్నాయని వారు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షన్నర కోట్ల వరకు పలు రకాల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇందులో ఉద్యోగులు, ఇతర నిర్వహణ బిల్లులు పక్కన పెడితే, పనులకు ఇవ్వాల్సిన బిల్లులే సమస్యగా మారుతున్నాయి. ఈ బిల్లుల చెల్లింపుల్లో ప్రాధాన్యతాక్రమాన్ని పాటిస్తున్నట్లు ఆ శాఖ అధికారులు చెబుతుండగా, ఆ ప్రాధాన్యతా బిల్లులను గుర్తించే క్రమంలో తమకు కావాల్సిన వారి బిల్లులను కూడా జత చేసేందుకు పేషీలు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. తమ వద్దకు వచ్చిన కాంట్రాక్టర్ల బిల్లులను ప్రాధాన్యతా బిల్లుల జాబితాలో కలిపేసేందుకుగాను నజరానాలు సమర్పించాలన్న డిమాండ్ ఆ శాఖ ఉద్యోగుల నుంచి వస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. బిల్లుల కోసం వచ్చే వారికి ఉన్నతాధికారులను కలిసే అవకాశం కూడా లభించడం లేదు. 'సార్ మీటింగ్‌లో ఉన్నారు. ఇవాళ కుదరదు' అన్న సమాధానాలు వస్తున్నట్లు కాంట్రాక్టర్లు చెబుతున్నారు.










