Aug 06,2023 11:52
  • 400 ఎకరాలు ఇవ్వాలని హెచ్చరిక

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : 'మీ పొలం ఇవ్వండి లేకపోతే లాగేసుకుంటాం, ఎన్ని ఎకరాలు ఇచ్చినా రూ.5 లక్షలు పరిహారం ఇస్తాం' అని రెవెన్యూ అధికారులు ముంపు మండలాల ప్రజలపై బెదిరింపులకు దిగుతున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పర్యటన సందర్భంగా ఈ బెదిరింపుల వ్యవహారం బయటకు వచ్చింది. పోలవరం బ్యాక్‌వాటర్‌ వల్ల ముంపునకు గురవుతున్న ఎటపాక మండలంలోని బాసవాడ గ్రామంలో సుమారు 200 మంది దళిత కుటుంబాలు ఉంటున్నాయి. సుమారు 400 ఎకరాలను వీరి కుటుంబాలు 50 ఏళ్లకుపైగా సాగు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల రెవెన్యూ అధికారులు ఆ గ్రామానికి వచ్చి రైతులతో సమావేశం ఏర్పాటుచేశారు. మీ గ్రామంలో భూమి అవసరం ఉందని, 400 ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చేయాలని అల్టిమేటం ఇచ్చారు. దీనిపై రైతులు అభ్యంతరం తెలిపారు. తాము భూములు ఇవ్వబోమని, దశాబ్దాల తరబడి వంశపారంపర్యంగా సాగు చేసుకుంటున్నామని అన్నారు. అయితే ముంపు పరిధిలో ఉన్నందున ఇవ్వాల్సిందేనని, ఇవ్వకపోతే తామే తీసేసుకుంటామని, నోటిఫికేషన్‌ ఇచ్చేస్తామని బెదిరింపులకు దిగారు. అయితే రైతులకు ఎన్ని ఎకరాలు ఇచ్చినా కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం మాత్రమే ఇస్తామని తెలిపారు. దీనిపైనా రైతులు ప్రశ్నించారు. చట్ట ప్రకారం ప్రాజెక్టు పరిధిలో ఉన్నందున పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని, ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఎంత భూమి ఇస్తే అంత ఇవ్వబోమని, రెండున్నర ఎకరాలకంటే ఎక్కువ ఉన్నా రూ.ఐదు లక్షల పరిహారం మాత్రమే ఇస్తామని తెలిపారు. దీంతో ఏమి చేయాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే మీ భూముల్లో సాగుకు ప్రభుత్వం అంగీకరించబోదని బెదిరించారు. రైతులను ఎన్ని రకాలుగా బెదిరించాలో అన్ని రకాలుగా వారు బెదిరింపులకు దిగారు. తాము నిరుపేదలమని, తినడానికి అండగా ఉన్న పొలం ఇచ్చేస్తే ఎలా బతకాలని వారు అధికారులను ప్రశ్నించారు. దీనికి స్పందించిన అధికారులు భవిష్యత్‌లో మీ భూముల్లో జరిగే పనుల్లో మీకే కూలిపని ఇప్పిస్తామని హేళనగా మాట్లాడారు. దీంతో మానసికంగా ఇబ్బంది పడ్డ ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక పోలవరం సమస్యలపై నికరంగా, నిజాయతీగా పోరాడుతున్న సిపిఎం నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. గురువారం ముంపు ప్రాంతాల పర్యటనకు వెళ్లిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు దృష్టికి తెచ్చారు. మీరే న్యాయం చేసేలా చూడాలని వేడుకున్నారు. దీనిపై బాధితుడు సర్వయ్య మాట్లాడుతూ.. తమ తాతల కాలం నుండి ఇక్కడ సాగు చేసుకుంటున్నా మని, అధికారులు ఇబ్బందులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. తాము మనుషులమేనన్న విషయాన్ని అధికారులు గుర్తించాలని, తమతో మాట్లాడే సమయంలో అసలు మనుషులుగా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.