'కథ బాగుంటే.. ప్రేక్షకులు ఆదరిస్తారు..' ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎక్కువగా వినిపించే మాట ఇది. ముఖ్యంగా పెద్ద హీరోలు ప్రీరిలీజ్ వేదికలపై చెబుతున్నారు. తాజాగా ఇదే మాటను యాక్షన్ కింగ్ అర్జున్ కూడా చెబుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా స్పందించారు. నిజానికి అర్జున్ అచ్చ తెలుగువాడిలా కనిపించినా, ఆయన మాతృభాష కన్నడ. కానీ తెలుగులో చాలా మంది హీరోలతో కలిసి, మల్టీస్టారర్ చేశారు. 'జెంటిల్ మ్యాన్, ఒకే ఒక్కడు, మా ఊరి గోపాలుడు, పుట్టింటికి రా చెల్లి, మంజునాథ, శ్రీ ఆంజనేయం' వంటి సినిమాల్లో అయన నటన వేరే లెవల్లో ఉంటుంది. ప్రస్తుతం హీరో విశ్వక్‌సేన్, తన కుమార్తె ఐశ్వర్యను హీరోయిన్‌గా పరిచయం చేస్తున్న చిత్రానికి అర్జున్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురించిన కొన్ని విశేషాలు..!
అర్జున్ సర్జా.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే సినిమా 'ఒకే ఒక్కడు..' ఈ ఒక్క సినిమా అన్ని భాషల్లో అప్పటివరకూ ఉన్న రికార్డులన్నీ తుడిచి పెట్టేసింది. ఎన్ని వందల సార్లు టీవీల్లో ఈ సినిమా వస్తున్నా కన్నార్పకుండా అలాగే చూస్తూ ఉంటారు. సుమారు 130 సినిమాల్లో అర్జున్ నటించాడు. కొన్నింటికి నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగానూ వ్యవహరించారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'మాపల్లె గోపాలుడు' చిత్రంతో తెలుగులో తెరంగేట్రం చేశారు. అంతకు ముందు కన్నడ, తమిళంలో నటించారు. నటుడిగానే కాకుండా సహాయ నటుడిగా, ప్రతినాయకుడిగా కూడా నటించాడు. కాగా అర్జున్ తండ్రి శక్తి ప్రసాద్ కన్నడ సినిమాల్లో చాలా పెద్ద నటుడు. విలన్‌గానూ అయన అనేక సినిమాల్లో నటించాడు. ఇక అర్జున్ భార్య ఆశ రాణి హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ అనేక సినిమాల్లో నటించారు. ఆమె తండ్రి కన్నడ స్టార్ యాక్టర్ రాజేష్.. ఈయన ఒక వెటరన్ నటుడు అని చెప్పుకోవాలి. అర్జున్ అన్నయ్య కూడా కన్నడలో అనేక సినిమాలకు దర్శకత్వం వహించి, చిన్న వయసులో అనారోగ్యంతో కన్ను మూశారు. ఇక అర్జున్ అక్కకు ముగ్గురు కొడుకులు కాగా, వారంతా హీరోలుగా సెటిల్ అయ్యారు. వారి పేర్లు ధ్రువ సర్జా, చిరంజీవి సర్జా, భరత్ సర్జా. ముగ్గురు కన్నడలో స్టార్ యాక్టర్స్‌గా కొనసాగుతున్నారు. చిరంజీవి సర్జా గుండెపోటుతో ఇటీవలే కన్ను మూయగా, అతని భార్య మేఘనరాజ్ మన తెలుగు హీరోయిన్. ఇక అర్జున్ తన ఇద్దరు కూతుళ్లను హీరోయిన్స్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే పెద్ద కూతురు లాంచ్ అయ్యి సినిమాలు చేస్తుండగా, చిన్న అమ్మాయి హీరోయిన్ అవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే అర్జున్ ఫ్యామిలీలో ఇంతమంది నటులు ఉన్నారనే విషయం బయటకు పెద్దగా తెలియదు.
మొదట్లో నటనంటే తెలీదు..
ఈ మధ్యకాలంలో ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. 'నేను మొదటగా నటించిన చిత్రంలోని ఒక సన్నివేశంలో సరిగా నటించకపోవడంతో దర్శకుడు ఏడవమంటే తెలియక నవ్వాను. దానికి ఆగ్రహించిన దర్శకుడు చెంపపై కొట్టారు. మొదట్లో నాకు నటన అంటే ఏమీ తెలియదు' అని చెప్పుకొచ్చారు. 'దర్శక నిర్మాతలు నా బాడీ చూసి హీరోగా పనికి వస్తారని అనుకున్నారు. అయితే మొదట్లో మా నాన్నగారికి నేను నటుడిగా మారడం ఇష్టం లేదు. అందుకే అనేక ఆఫర్లను తిరస్కరించారు. అయితే నిర్మాత రాజేంద్రసింగ్ బాబు నాన్నగారి అనుమతి లేకుండా తన ప్రొడక్షన్ హౌస్ కోసం ఒక ఫీచర్ ఫిల్మ్ షూటింగ్‌కి నన్ను ఒప్పించారు. ఆ తరువాతే నాన్నగారు సినిమాలోకి వెళ్లడానికి అంగీకరించారు' అని అర్జున్ వివరించారు.
అలాంటివేవీ ఉండవు.. అదే నా అభిప్రాయం..
'పాన్ ఇండియా సినిమా అంటూ ఏం లేదనేది నా అభిప్రాయం. సినిమా బాగుంటే అది అన్నిచోట్లకూ వెళ్తుంది. ఈ విషయాన్ని ''కేజీయఫ్'' నిరూపించింది. కన్నడ చిత్ర పరిశ్రమ చిన్నదని చాలామంది అనుకున్నారు. కానీ, అక్కడి నుంచి వచ్చిన ఆ చిత్రం.. విడుదలైన అన్ని ప్రాంతాల్లో అద్భుతంగా ఆడింది. ''క్వాలిటీ సినిమా ఇస్తే మేం తప్పకుండా చూస్తాం'' అనే ప్రేక్షకుల మాట ప్రపంచ వ్యాప్తంగా నిజమైంది. కథ బాగుంటే విజయం తథ్యం.. అనేది ఇప్పుడే కాదు ఎప్పటికీ వర్తిస్తుంది' అని అర్జున్ చెప్పారు.
ప్రేక్షకుల నాడిని పసిగట్టాలి..
'అన్నింటికంటే ముందు కథ బాగుండాలి. ప్రేక్షకులు ఎలాంటి కథలను ఆస్వాదిస్తున్నారో పరీక్షిస్తూ వాటికి తగ్గట్టు ఎంపిక చేసుకోవాలి. ఓటీటీలో ప్రేక్షకుడికి కావాల్సిన అనేక ప్రత్యామ్నాయాలున్నాయి. తక్కువ బడ్జెట్ చిత్రాలు మినిమంలో మాగ్జిమం ఇస్తేనే ఆదరణ పొందుతాయి. ఇది సవాల్‌తో కూడుకున్నది. ప్రస్తుతం నా కూతురు ఐశ్వర్య హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నా. అందులో విశ్వక్‌సేన్ హీరో. నేనూ చిన్న పాత్రలో కనిపిస్తా. జగపతిబాబు, ప్రకాష్‌రాజ్ సహా చాలామంది నటిస్తున్నారు. టైటిల్ త్వరలోనే ప్రకటిస్తాం. మరో రెండు సినిమాలు చిత్రీకరణలో ఉన్నాయి. తెలుగులో కూడా దర్శకత్వం చేస్తాను. కథ సిద్ధంగా ఉంది. నా కుమార్తె సినిమా పూర్తి అయిన తర్వాత ఆ సినిమా చేస్తా. అందులో నాటి అర్జున్‌ను చూస్తారు!' అన్నారు.
అసలు పేరు : శ్రీనివాస్ సర్జా (అర్జున్ సర్జా)
ఇతర పేర్లు : అశోక్ బాబు, శ్రీను
పుట్టిన తేదీ : ఆగస్టు 15, 1964
పుట్టిన ప్రాంతం : మధుగిరి, కర్ణాటక
నివాస ప్రాంతం : చెన్నయ్
చదువు : బి.ఎస్సీ
భార్య : ఆశా రాణి(నటి)
పిల్లలు : ఐశ్వర్య అర్జున్, అంజన
తల్లిదండ్రులు : శక్తి ప్రసాద్ సర్జా, లక్ష్మి సర్జా
తోబుట్టువులు : కిషోర్ సర్జా